హైదరాబాద్: వివాహేతర సంబంధానికి (Illegal Affair) అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ తన ప్రియుడితో భర్తను హత్య చేయించింది. తమపైకి రాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయింది. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకున్నది.
చౌడాపూర్కు చెందిన కర్రె రత్తయ్య, కవిత దంపతులు. వారికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. రత్నయ్య పొలం పనులు చేస్తుండగా, కవిత ఓ ప్రైవేటు కంపెనీలో కూలీకి వెళ్తున్నది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణతో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న రత్నయ్య.. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుర్లు ఉన్నారని, ఇలాంటి పనులు మానెయ్యాలని కవితను హెచ్చరించాడు. అయినా ఆమె తన ప్రవర్తనను మార్చుకోకపోగా, తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది.
ఇందులో భాగంగా ప్రియుడు రామకృష్ణతో కలిసి పథకం రచించింది. రోజూలానే పొలం పనులకు వెళ్తున్న రత్నయ్యను.. ట్రాక్టర్‌తో వెనుక నుంచి ఢీకొట్టాడు రామకృష్ణ. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కవితను విచారించగా తన భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడని పోలీసులకు తెలిపింది. అయితే కవితపై అనుమానం ఉందని రత్నయ్య తమ్ముడు దేవయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో కవితను పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం ఒప్పుకున్నది. ప్రియుడితో కలిసి హత్యచేయించానని చెప్పింది. దీంతో కవిత, రామకృష్ణను అరెస్టు చేశారు.