ఒకప్పుడు నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు అని పాడుకునే తీరుకు కాలం చెల్లి మేమొస్తం సర్కారు దవాఖానకు అనే స్థాయికి మెరుగుపడ్డాయి. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో దవాఖానల్లో సకల సౌకర్యాలు సమకూరడంతో పాటు మెరుగైన వైద్యం అందుతున్నది. దీనికి తోడు కేసీఆర్ కిట్, ‘అమ్మఒడి’తో సాయం వంటి వాటితో ప్రజలకు నమ్మకం పెరిగింది. వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలకు గర్భిణులు క్యూ కడుతున్నారు. జిల్లావ్యాప్తంగా గడిచిన ఐదేండ్లలో అర్హులైన 39,466 మందికి కేసీఆర్ కిట్స్‌ను పంపిణీ చేయగా, అమ్మఒడిలో భాగంగా సుమారు రూ.25 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. గతంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో నెలకు 150 ప్రసవాలు జరుగగా, కేసీఆర్ కిట్స్ పథకాన్ని అమలు చేస్తున్నప్పటి నుంచి తాండూరు జిల్లా దవాఖానలో నెలకు 500 లకుపైగా, వికారాబాద్ ఏరియా దవాఖానలో నెలకు 200 వరకు ప్రసవాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో 80 శాతం సాధారణ ప్రసవాలే ఉండడం, ప్రైవేటు దవాఖానల్లో ప్రసవా సంఖ్య తగ్గడం గమనార్హం.
వికారాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : సర్కారు దవాఖానలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో మెరుగైన వైద్యం అందించడంతో పాటు సకల సదుపాయాలను కల్పించారు. ఒకప్పుడు ‘నేను రాను బిడ్డో సర్కా రు దవాఖాన’కు అని పాడుకున్న దవాఖానలకు కేసీఆర్ కొత్త రూపం తీసుకొచ్చారు. ఆధునిక వసతులతో నేడు ప్రభుత్వ దవాఖానలు ప్రైవేటుతో పోటీ పడుతున్నాయి. కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్‌తో తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ, కంటివెలుగు, డయాలసిస్, డయాగ్నోస్టిక్ కేంద్రాల ఏర్పాటు, బస్తీ, పల్లె దవాఖానలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కళాశాలలు ఇలా ఎన్నో అమల్లోకి తీసుకొచ్చారు.
మెరుగైన వైద్యం అందుతుండడంతో సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరగడం గమనార్హం. ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలతో గతంలో ఎన్నడూలేని విధంగా సర్కారు దవాఖానల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ గర్భిణులకు ప్రసవమైతే 15 వస్తువులతో పాటు కూడిన కేసీఆర్ కిట్‌తో పాటు అమ్మఒడి పథకంలో భాగంగా నగదు ప్రోత్సాహకాలను అందజేస్తు న్నారు. దీంతో గర్భిణులు ప్రసవం కోసం ప్రైవేట్ దవాఖానల వైపు వెళ్లే గర్భిణుల సంఖ్య బాగా తగ్గింది. అలాగే కార్పొరేట్ స్థాయిలో సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం అందిస్తుం డడంతో సాధారణ వైద్యం నిమిత్తం వచ్చే ప్రజలు రోజు రోజుకూ పెరుగుతున్నారని వైద్యారోగ్య శాఖ జిల్లా అధికారులు వెల్లడిస్తున్నారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన కేసీఆర్ కిట్, అమ్మఒడితో జిల్లాలోని సర్కారు దవాఖానలకు పూర్వవైభవం వచ్చిందని జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా గత ఐదేండ్లలో అర్హులైన 39,466 మందికి కేసీఆర్ కిట్లను పంపిణీ చేయగా, అమ్మఒడిలో భాగంగా సుమారు రూ.25 కోట్ల ఆర్థిక సాయా న్ని ప్రభుత్వం అందజేసింది.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 39,466 కేసీఆర్ కిట్లను లబ్ధిదారులకు అందజేశారు. 2017 జూన్ నుంచి అమలు చేస్తున్న కేసీఆర్ కిట్ పథకంతో జిల్లాలోని సర్కారు దవాఖా నల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. గతంలో జిల్లాలోని అన్ని సర్కారు దవాఖానల్లో నెలకు 150 ప్రసవాలు జరుగగా, కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్నప్పటి నుంచి జిల్లాలోని దవాఖానల్లో ప్రసవాల సంఖ్య 450 వరకు పెరిగినట్లు సం బంధిత అధికారులు చెబుతున్నారు. గత ఐదేండ్లుగా జిల్లాలో పంపిణీ చేసిన కేసీఆర్ కిట్‌కు సంబంధించి 2017-18 ఆర్థిక సంవత్సరంలో 5,370 కిట్లు, 2018-19లో 6,382, 2019-20లో 6,165, 2020-21లో 6,920, 2021-22లో 7,721, ఈ ఏడాది ఇప్పటివరకు 6,908 కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. అలాగే జిల్లాలో ప్రసవాల సంఖ్య కూ డా పెరిగింది. గతంలో కనీస వసతులు లేకపోవడం, సిబ్బంది లేకపోవడంతో ప్రసవాల కోసం సర్కారు దవాఖానలకు రావాలంటే భయపడే వారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారు దవాఖానలకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో పాటు కావాల్సిన అన్ని సదుపాయా లను కల్పించడంతో జిల్లాలో గత ఐదేండ్లలో సాధారణ ప్రసవాల సంఖ్య కూడా పెరిగింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 4,670 ప్రసవాలు, 2018-19లో 4,943, 2019-20లో 5,492, 2020-21లో 5,693, 2021-22లో 6017, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 5,864 సాధారణ ప్రసవాలు జరిగాయి. తాండూరు జిల్లా దవాఖానలో నెలకు 500 పైగా, వికారాబాద్ ఏరియా దవాఖానలో నెలకు 200 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. సర్కారు దవాఖానల్లో జరుగుతున్న ప్రసవాలన్నీ 80 శాతం సాధారణ ప్రసవాలే ఉండడం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం 2017 జూన్‌లో కేసీఆర్ కిట్ పథకంతో పాటు అమ్మఒడి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ప్రభు త్వ దవాఖానల వైపు తిరిగి ప్రజలు వచ్చేలా కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాలతో పాటు మెరుగైన వైద్యం అందుతుండడంతో సర్కారు దవాఖానలపై నమ్మకం పెరిగింది. ఈ పథకాల్లో భాగంగా సర్కారు దవాఖానలో ప్రసవం చేయించుకున్న వారికి 15 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను అందజేస్తున్నారు. సంబంధిత కిట్‌లో పుట్టిన బిడ్డకు సంబంధించి 15 రకాల వస్తువులను పొందుపర్చి గర్భిణులకు అందజేస్తున్నారు. అలాగే అమ్మఒడి పథకంలో భాగంగా గర్భిణులకు నగదు ప్రోత్సాహకం అందజేస్తున్నారు. ఈ నగదు ప్రోత్సాహకాన్ని పలు విడుతల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం అందజేస్తున్నది. మొదటి విడుతలో సర్కారు దవాఖానలో గర్భిణిగా తన పేరు నమోదు చేసుకోవడంతో పాటు వైద్య పరీక్షలు, టీటీ ఇంజక్షన్, ఐరన్ మాత్రలు తీసుకుంటే రూ.3వేలు అందజేస్తారు. రెండో విడుతలో భాగంగా ప్రసవం అయిన వెంటనే రూ.4 వేలు, ఆడపిల్ల పుడితే రూ.5 వేలు సాయాన్ని అందజేస్తున్నారు.
కార్పొరేట్‌కు దీటుగా సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యంతో పాటు అన్ని రకాల వసతులను ప్రభుత్వం కల్పిస్తున్నది. కేసీఆర్ కిట్, అమ్మఒడి పథకాలతో ప్రభుత్వ దవాఖానలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ప్రసవాల సంఖ్య పెరిగింది. తాండూరు జిల్లా దవాఖానలో నెలకు 500 పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. అన్ని రకాల సదుపాయాలు సర్కారు దవాఖానల్లో ఉన్నాయి. ప్రభుత్వదవాఖానల్లో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రైవేటు దవాఖానల వైపు ఎవరూ వెళ్లొద్దు.
– డాక్టర్ పల్వన్‌కుమార్, డీఎంహెచ్‌వో, వికారాబాద్