Shadnagar | షాద్‌నగర్, మార్చి 21 : తాగుడుకు బానిసై కట్టుకున్న భార్యను అతి కిరాతంగా ఓ భర్త గొడ్డలితో నరికి చంపిన ఘటన ఫరూఖ్‌నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం పరుశరాములు, అతని భార్య జమున (38) గ్రామంలో నివాసం ఉంటూ ఉపాధి పొందుతుండేవారు. పరుశరాములు గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసై తరుచుగా భార్యను వేధిస్తుండేవాడు.
ఇందులో భాగంగానే గురువారం రాత్రి డబ్బుల విషయమై ఇరువురి మద్య గొడవ జరిగింది. ఇంతలోనే భార్యపై మరింత కోపం పెంచుకున్న పరుశరాములు సమీపంలో ఉన్న గొడ్డలితో ఆమె మెడపై నరకడంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. హత్యకు పాల్పడిన పరుశరాముడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.