కారు స్పీడుకు ప్రతిపక్ష పార్టీలు కుదేలవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో జిల్లా బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తుంటే.. కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు మాత్రం వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల, షాద్‌నగర్, కల్వకుర్తి స్థానాలకు, బీజేపీ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసినా ప్రచారం ఊసేలేదు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతల నుంచి సహకారం కొరవడడంతోపాటు ఓటమిని ముందుగానే ఊహించి ప్రచారం చేయడం లేదని తెలుస్తున్నది. ఫలితంగా.. క్యాడర్‌లోనూ నిస్తేజం ఆవహించి ప్రచార సందడే కరువైనది. బీఆర్ఎస్కు ప్రతిపక్షాలు పోటీ ఇవ్వడం సంగతి పక్కన పెడితే.. కనీసం ప్రచారం కూడా చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.
-రంగారెడ్డి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కానీ.. జిల్లాలో కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకంటే వెనుకంజలోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేవెళ్ల, షాద్‌నగర్, కల్వకుర్తి స్థానాలకు, బీజేపీ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అయినప్పటికీ ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం ఊసేలేదు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతల నుంచి సహకారం కొరవడడంతోపాటు ఓటమిని ముందుగానే ఊహించి ప్రచారం చేయడం లేదని తెలుస్తున్నది. ఫలితంగా..క్యాడర్‌నూ నిస్తేజం ఆవహించి ప్రచార సందడే కరువైనది. హ్యాట్రిక్ నినాదంతో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే..కాంగ్రెస్, బీజేపీలు పోటీ ఇవ్వడం సంగతి పక్కన పెడితే.. కనీసం ప్రచారంలోనూ అభ్యర్థులు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల ప్రచారాన్ని భుజాన వేసుకోవాల్సిన రాష్ట్ర స్థాయి నేతలు ఢిల్లీకే పరిమితమయ్యారు. నియోజకవర్గాల్లో పర్యటించేందుకు రాష్ట్రస్థాయి నేతలెవ్వరూ రాకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల్లో ఒకింత అసహనం నెలకొన్నది. బరిలో ఉన్నామా? అంటే ఉన్నాం! అన్న ట్లుగా వారు వ్యవహరిస్తున్నారు తప్ప అభ్యర్థుల్లో సీరియస్‌నెస్ కనిపించడంలేదన్న విమర్శలున్నాయి. టికెట్లు ఖరారైన అభ్యర్థుల్లో కొందరు ఇప్పటికీ క్షేత్రస్థాయిలోకే వెళ్లలే దు. అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలను ఆయా పార్టీల అధిష్ఠానాలు చేయకపోవడం తో నేటికీ నేతలు ఎవరికి వారే! అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రచార సందడి లేక క్యాడర్ లోనూ నిస్తేజం అలుముకోవడంతో నేతలపై పార్టీశ్రేణులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
చేవెళ్ల అభ్యర్థిగా భీంభరత్, షాద్‌నగర్‌కు శంకరయ్యను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటివరకు భీం భరత్ ప్రచారాన్ని ప్రారంభిం చలేదు. టికెట్ కోసం ప్రయత్నించిన నేతల్లో అసంతృప్తి జ్వాల లు చల్లారకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. ఆశావహుల్లో ఒకరైన రాచమళ్ల సిద్ధ్దేశ్వర్ ఎన్నికల బరిలో ఉంటానని ఇప్పటికే ప్రకటించారు. మిగిలిన ఇద్దరు నేతలూ షాబాద్ దర్శన్, వసంతం ప్రచారానికి దూరంగానే ఉంటున్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకరయ్య పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా మారింది. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి ఇటీవలే ఇద్దరు జడ్పీటీసీలతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యా రు. కొత్తగా చేరిన వారితో ఇన్నాళ్లుగా పార్టీ జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు ఇబ్బంది పడుతుండడం శంకరయ్య కు తలనొప్పిగా మారింది.
మాజీ జడ్పీ వైస్ చైర్మన్ నవీన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ సైతం శంకరయ్య ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. కల్వకుర్తిలోనూ కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రచారం చేస్తున్నప్పటికీ పెద్దగా ప్రభా వం చూపలేకపోతున్నారు. మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములుయాదవ్ బరిలో ఉన్నామంటే ఉన్నామనే రీతిలోనే ప్రచారం చేస్తున్నారు. అనూహ్యంగా టికెట్‌ను దక్కించుకున్న ఇబ్రహీంపట్నం బీజేపీ అభ్యర్థి నోముల దయానంద్‌గౌడ్ ఇప్పటివరకు ప్రచారాన్నే మొదలుపెట్టలేదు. టికెట్ ద క్కని నేతలు దయానంద్‌కు సహకరించే పరిస్థితులు కనబడడం లేదు. దీంతో ఆయన ఒంటరిగానే ప్రచారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. కల్వకుర్తి బీజేపీ అభ్య ర్థి ఆచారి ప్రచారం కూడా మొక్కుబడిగానే సాగుతున్నది.
రంగారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇప్పటికే ఒక విడుత నియోజకవర్గాలను చుట్టేసి వచ్చారు. మలి విడుత ప్రచారంతో దూసుకుపోతుండగా.. ఇంకా కొన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులనే ఖరారు చేయలేదు. ఇబ్రహీంపట్నం, మహే శ్వ రం నియోజకవర్గాలకు పోటీ ఎక్కువగా ఉండగా వర్గ విభేదాలు భగ్గుమనే పరిస్థితి ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో వెనుకంజ వేస్తున్నది. ఇక చేవెళ్ల, షాద్ నగర్ నియోజకవర్గాలకు సైతం బీజేపీ ఇప్పటివరకు అభ్యర్థులను తేల్చలేదు. క్యాడర్ లేక సతమతమవుతున్న బీజేపీకి సరైన అభ్యర్థులు లేకనే తాత్సారం చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో రెండు పార్టీల నేతల క్యాడర్ సైతం అసంతృప్తిగానే ఉన్నది.