మంచాల, ఆగస్టు 20: వన సంపదను సంరక్షించవల్సిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా అడ్డదారిన కలప తరలి పోతున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంచాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెద్దపెద్ద చెట్ల దుంగల్ని నరికి వాటిని అర్ధరాత్రి లారీల్లో ఎక్కించి నగరానికి తరలిస్తున్న విషయం సంబంధిత క్షేత్ర స్థాయి సిబ్బందికి తెలిసిప్పటికీ వారు వాహనాలను వదిలిపెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంచాల మండలంలో ఉన్న అడవిని సంరక్షించేందుకు సెక్షన్ ఆఫీసర్‌తో పాటు ముగ్గురు బీట్ ఆఫీసర్లు ఉండాల్సి ఉండగా, అందులో ఒక్కరు మాత్రమే ఇన్చార్జి బీట్ ఆఫీసర్‌గా మంచాలలో విధులు నిర్వర్తిస్తూ రెండు మండలాల్లో జరుగుతున్న అక్రమంగా కలప రవాణా చేస్తున్న వ్యాపారులకు బీట్ ఆఫీసర్ చెప్పిందే వేదంగా నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉదయం సమయంలో అటవీ ప్రాంతంలో చెట్లను నరికి లారీల్లో రాత్రి సమయంలో దుంగలు ఎక్కించి కట్టెలు కనిపించకుండా కవరు కప్పి తరలిస్తున్నారు.
మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్న అక్రమ కలపధారుల వివరాలు అటవీ శాఖ అధికారుల దగ్గర ఉన్నప్పటికీ ఏ గ్రామంలో ఏ లారీ ఎప్పుడు నగరాని వెళుతున్న విషయం స్థానికులు అధికారులకు చెప్పినప్పటికీ వారు ఏమీ పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీ సంపదను రక్షించాల్సిన అధికారులు కండ్లు మూసుకోవడంతో నిత్యం ఎన్నో లారీల ద్వారా కలపను తరలించడంతో అటవీ సంపద మొత్తం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.
ఇష్టానుసారంగా నరికివేత..
చెట్లను ఇష్టానుసారంగా నరికివేయడంతో పర్యావరణ సమతుల్యం లోపిస్తుంది. మొక్కలు నాటకపోవడం.. నాటిన మొక్కలను పర్యవేక్షించక పోవడంతో అడవులు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత అధికారులు తీసుకోకపోవడంతో కొన్ని మొక్కలు ఎండిపోతున్నాయి. వాటి స్థానంలో మళ్లీ మొక్కలు నాటాల్సి ఉన్నా కూడా అదెక్కడా అమలు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ అటవీ సంపదను కాపాడేందుకు అవసరమైన చర్యలు అధికారులు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
శిథిలావస్థలో బీట్ ఆఫీసర్ కార్యాలయం
మంచాలలో అక్రమ కలప రవాణాను అడ్డుకునేందుకు ఆగపల్లిలో సాగర్ రహదారి పక్కన బీట్ ఆఫీసర్ కార్యాలయం ఉన్నప్పటికీ అది పూర్తిగా శిథిలావస్థకు చేరడమే కాకుండా మద్యం బాబులకు అడ్డాగా మారింది, వన సంపద సంరక్షణ కోసం ప్రధాన రహదారి పక్కన బీట్ ఆఫీసర్ ఉండేందుకు వారి కోసం ప్రత్యేకంగా క్వార్టర్స్ నిర్మించినప్పటికీ దాని ఆలన,పాలనా చూడకపోవడంతో అది శిథిలావస్థకు చేరింది. బీట్ ఆఫీసర్ కార్యాలయ మరమ్మతుల కోసం నిధులు మంజూరైనప్పటికీ వాటిని పట్టించుకోకపోవడంతో ఇక్కడ ఉండాల్సిన అధికారులు ఇంటికి పరిమితమయ్యారు. దీంతో కలప జోరుగా దొడ్డిదారిన నగరంలోని పరిశ్రమలకు తరలిపోతుందనే ఆరోపణలున్నాయి.