తాండూరు, ఆగస్టు 19 : బీఆర్ఎస్ నాయకులను హౌజ్ అరెస్టులు చేసి కాంగ్రెస్ నాయకులు ఏం దాచిపెడుతున్నారు, దవాఖానలో పరిస్థితులు తెలుసుకునేందుకు బుధవారం సనత్‌నగర్ టిమ్స్ సందర్శనకు వెళుతున్న నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మణికొండలో తనను హౌస్ అరెస్టు చేయడంతో పోలీసుల వైఖరిపై, ప్రభుత్వ తీరుపై నిరసించారు. ప్రతిపక్షనాయకులు ఆసుపత్రిని సందర్శించడమే నేరమా? ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన అని ప్రశ్నించారు. సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి కట్టింది తనే అని రేవంత్‌రెడ్డి చెప్పుకొంటున్నారని, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆసుపత్రికి వెళుతుంటే దానికి కూడా ఆరెస్టులతో అడ్డుపడతారా అని ప్రశ్నించారు.
టిమ్స్‌లో డొల్లతనం బయట పడుతుందన్న కారణంతోనే బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు పోలీసులను పంపి హౌస్ అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు. సనత్‌నగర్ టిమ్స్ ప్రధాన గేటు ఎదుట ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదని, జీతాలు చెల్లించకపోవడంతో తమ బతుకులు దినదినగండంగా సాగుతున్నాయని వారు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వేతనాలు చెల్లించకుండా నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరించడం దారుణమన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని పరిస్థితులుంటే వెంటనే ఈ పరిస్థితులపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలి కాని.. ప్రతిపక్ష నాయకులకు అడ్డుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. నిర్బంధాలతో వాస్తవాలను దాచిపెట్టాలనుకోవడం భ్రమ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆందోళన చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

అరెస్టులు అన్యాయం
పరిగి, ఆగస్టు 19 : సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీశ్‌రావు పిలుపు మేరకు బుధవారం ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిని ఆయన నివాసంలో రాజేంద్రనగర్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అరెస్టులతో అడ్డుకోవడం సరికాదని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. టిమ్స్ ఆసుపత్రి నిర్మాణానికి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టగా.. సీఎం రేవంత్‌రెడ్డి కేవలం రిబ్బన్ కట్ చేశారని పేర్కొన్నారు. హైదరాబాద్ నలువైపులా నాలుగు ఆసుపత్రుల ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్ణయించి నిధులు విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య చికిత్సలు అందించాలన్నది కేసీఆర్ ఆశయమని పేర్కొన్నారు.