ఇబ్రహీంపట్నం, జనవరి 21 : బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం కోసం ఎమ్మెల్యే తనయుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ఆదివారం నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఆదివారం యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలోని నందీశ్వరాలయం నుంచి ఈ యాత్ర కొనసాగనున్నది. యాత్రను ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో సుమారు 65 రోజులు కొనసాగనున్నది. రోజుకు రెండు, మూడు గ్రామాల చొప్పున ఆయన పాదయాత్ర చేపట్టనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు. పాదయాత్ర విజయవంతానికి బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.
భారీ వేదిక.. గులాబీమయం
యాచారం : నందివనపర్తి గ్రామంలో పాదయాత్ర ప్రారంభానికి భారీ ఏర్పాట్లు చేశారు. మండలంలో 9 రోజులు, 18 గ్రామాల్లో పాదయాత్ర కొనసాగనున్నది. పాదయాత్ర ప్లెక్సీలు, గోడ పత్రికలు, వాల్ పెయింటింగ్స్ వేశారు. సభా ప్రాంగణాన్ని సీఐ లింగయ్య, ఎస్ఐ ప్రసాద్, బీఆర్ఎస్ శ్రేణులు పరిశీలించారు.
విజయవంతం చేయండి : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన పాదయాత్రను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పాదయాత్రలో ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలన్నారు. పాదయాత్ర ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తారని తెలిపారు. పాదయాత్ర విజయవంతం కోసం పార్టీ శ్రేణులంతా పని చేయాలని సూచించారు.
ప్రగతినివేదన పాదయాత్రకు తరలిరావాలి
ఇబ్రహీంపట్నంరూరల్ : బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన పాదయాత్రకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు అన్నారు. శనివారం ఇబ్రహీంపట్నంలో వారు మాటాడుతూ.. యాచారం మండలం నందివనపర్తి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి భారీగా తరలిరావాలని కోరారు. ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ఉపసర్పంచ్ భగీరథ్, నాయకులు మైసయ్య తదితరులున్నారు.