వికారాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయింది. సబ్బండ వర్ణాలను గాలికి వదిలేసింది. ముఖ్యంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన గురుకులాలపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహస్తున్నది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం గురుకుల పాఠశాలల చుట్టూ ప్రదక్షిణలు చేసిన పరిస్థితుల నుంచి.. ప్రస్తుతం గురుకులాలు అంటేనే హడలి పోయి పరిస్థితి నెలకొన్నది.
తాము ఆ పాఠశాలల్లో చదుకోబోమని.. అక్కడ పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు అక్కడికెళ్లేందుకు ఇష్టపడ డం లేదు. కేసీఆర్.. 200 గురుకులాలను వెయ్యి గురుకులాలకు పెంచి.. వాటిలో కార్పొరేట్ స్థాయి లో సౌకర్యాలు కల్పించి.. విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయగా.. 15 నెలలో కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో ఏదో ఒక ఘటన జరుగుతున్నా పాలకులు మా త్రం మొద్దు నిద్రను వీడకపోవడం శోచనీయం. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కేజీబీవీ, మో డల్ స్కూళ్లలో భయానక పరిస్థితులు నెలకొన్నా యి. ఫుడ్ పాయిజన్, ఎలుకలు, పాముకాటు ఘ టనలు, విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వ సమీక్షించుకోకపోవడంతోపాటు పర్యవేక్షణను గాలికి వదిలేసింది.
ఉపాధ్యాయినుల వేధింపులు భరించలేక..
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయినుల వేధింపులు తాళలేక పదోతరగతి విద్యార్థిని పాఠశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గతంలో విద్యార్థిని తల్లిదండ్రులతో జరిగిన గొడవను మనసులో పెట్టుకొన్న ఉపాధ్యాయినులు విద్యార్థినిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. అంతేకాకుండా విద్యార్థిని ప్రవర్తనపైనా చెడుగా ప్రచారం చేయడంతో తట్టుకోలేకపోయిన విద్యార్థిని తబిత ఫిబ్రవరి 24న స్కూల్ భవనం పై నుంచి కిందికి దూకడంతో ఆమె కాలు విరిగింది.
తబిత కాలు జారి పడిదంటూ ఆమె తల్లిదండ్రులకు గురుకుల పాఠశాల సిబ్బంది ఫోన్ చేయడంతో ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఉపాధ్యాయుల వేధింపులతోనే పాఠశాల భవనం పై నుంచి విద్యార్థిని దూకిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగ్రహం చెందిన విద్యార్థిని తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టి, టీచర్లను నిలదీశారు.
తబితను వేధించిన ఉపాధ్యాయినులను వెంటనే సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై బీసీ కమిషన్ సీరియస్ అయ్యింది. పది రోజుల్లోగా విచారించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌తోపాటు గురుకుల పాఠశాలల కార్యదర్శిని ఆదేశించింది. రాష్ట్రంలో తరచూ ఉపాధ్యాయులు వేధిస్తున్నారని విద్యార్థులు ఆత్మహత్యాయత్నం ఘటనలు జరగడం ఆందోళనకరమని, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది.
Rr4
నవాబుపేట కేజీబీవీలో..ఎలుకలు కరిచి
8 మంది విద్యార్థినులకు గాయాలు
బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ వసతి గృహలు, కేజీబీవీలు, గురుకులాల్లో కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించడంతోపాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షించగా.. 15 నెలల కాంగ్రెస్ పాలనలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగినా తూతూ మంత్రంగా దిద్దుబాటు చర్యలు చేపట్టి చేతులు దులుపుకొన్నదే తప్పా హాస్టళ్ల సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోలేదు. దీంతో హాస్టళ్లలో పాముకాటు, ఎలుకలు కరవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల నవాబుపేట మండల కేంద్రంలోని కేబీబీవీలో విద్యార్థినులను ఎలుకలు కరిచాయి.
గతనెల 24న నలుగురు, 27న మరో నలుగురు విద్యార్థినులను ఎలుకలు కరువడంతో కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో వారిని ప్రభుత్వ దవాఖానకు అక్కడి సిబ్బంది తీసుకెళ్లారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి ఆందోళన చేపట్టడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే మొదట ఎలుకలు కరిచినా సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే మరోసారి ఘటన జరిగింది.
అయితే ప్రభుత్వ వసతిగృహాల్లో పారిశుధ్యం లోపించడంతోనే పెద్ద సంఖ్యలో ఎలుకలు కేజీబీవీలోకి వస్తున్నట్లు విద్యార్థినులు చెబుతున్నారు. అపరిశుభ్రంతో ఎలుకలు, ఇతర విష పురుగులతో ఏ ప్రమాదం పొంచి ఉందోనని హాస్టళ్లలో భయం భయంగా గడుపుతున్నామని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళనతో డీఈవో కేజీబీవిని సందర్శించి వెళ్లిన అనంతరం సిబ్బంది దిద్దుబాటు చర్యలు చేపట్టారు. మధ్యా హ్నం తర్వాత అధ్వానంగా మారిన హాస్టల్ గదులను శుభ్రం చేసే పని చేపట్టారు.