రంగారెడ్డిజిల్లాలో సంక్షేమ హాస్టళ్లు సమస్యలమయంగా మారుతున్నాయి. సంక్షేమ హాస్టళ్లల్లో చేరి చదువుకోవాలనుకున్న విద్యార్థులు తమ సమస్యలపై రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్లకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సంక్షేమ హాస్టళ్లల్లో సీట్ల కోసం అనేక సిఫార్సులు చేయించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. సర్కారు ప్రకటించిన మెనూను పాటించకపోగా.. కాస్మోటిక్స్, ఇతరత్రా సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఓ వెలుగు వెలిగిన సాంఘిక సంక్షేమ హాస్టళ్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కుప్పకూలిపోయాయి. దీంతో సంక్షేమ హాస్టళ్లపై విద్యార్థుల తల్లిదండ్రులు నమ్మకం కోల్పోతున్నారు.
– రంగారెడ్డి, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ)
సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులే స్వయంగా రోడ్డెక్కుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించడంతోపాటు సర్కారు నిర్ణయించిన మెనూ ప్రకారం భోజనం పెట్టాలని.. కాస్మోటిక్స్, ఇతరత్రా బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని బాటసింగారం హాస్టల్లో కనీస సౌకర్యాలు కల్పించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. విజయవాడ-హైదరాబాద్ హైవేపై ధర్నాకు దిగారు. తాజాగా షాద్‌నగర్‌లో కొనసాగుతున్న నాగర్‌కర్నూల్ సంక్షేమ హాస్టల్లో సమస్యలపై ఆ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ నేషనల్ హైవే-44పై ధర్నా నిర్వహించారు. జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి సుమారు 60కి పైగా రెసిడెన్షియల్ పాఠశాలలున్నాయి. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సమస్యలకు ఎదురెల్లి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అడ్మిషన్లు ఒకచోట.. తరగతులు మరోచోట..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులు అడ్మిషన్లు ఒక చోట, తరగతులు మరో చోట జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాఠశాలల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఏర్పడింది. మంచాల మండలంలోని నోముల గ్రామంలో కొనసాగుతున్న బీసీ వెల్ఫేర్ పాఠశాలలో ఇబ్రహీంపట్నం, గోషామహల్, మలక్‌పేట్ ప్రాంతాల్లో అడ్మిషన్లు తీసుకుని నోముల గ్రామంలో ఏర్పాటు చేసిన బీసీ వెల్ఫేర్ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క పాఠశాలలో 480 మంది విద్యార్థులు మాత్రమే ఒక్క ప్రిన్సిపాల్ పరిధిలో ఉంటారు. కాని, నోములలో 3 పాఠశాలలకు చెందిన సుమారు 1500 మంది విద్యార్థులు ఉంటున్నారు.
ఇంతమంది విద్యార్థుల వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడలేని పరిస్థితిలో ప్రిన్సిపాల్ ఉన్నారు. అలాగే, మరోవైపు సిబ్బంది కొరత కూడా వెంటాడుతున్నది. ఒక్కో స్కూల్‌కు ఒక్కో ప్రిన్సిపాల్‌ను మాత్రమే కేటాయించాలని, మూడు నాలుగు పాఠశాలలకు ఒకే ప్రిన్సిపాల్‌ను కేటాయించడంతో విద్యార్థులు బాగోగులు పట్టించుకునే నాథుడు కరువైనట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. జిల్లాలో బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో 14 రెసిడెన్షియల్ పాఠశాలలు, ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 16 పాఠశాలలు, ఎస్టీ కార్పోరేషన్ ఆధ్వర్యంలో 14 రెసిడెన్షియల్ పాఠశాలలు, మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 8 రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాలలు ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. ఈ అద్దె భవనంలో ఎలాంటి సమస్యలు పరిష్కారం కాకపోగా ప్రిన్సిపాళ్లు కూడా అందుబాటులో ఉండటంలేదు. అలాగే, సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉండటం వలన పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం
రెసిడెన్షియల్ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను సర్కారు వెంటనే పరిష్కరించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సంక్షేమ హాస్టళ్లలో అన్ని రకాల సౌకర్యాలను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించడంతో రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీట్లు కూడా దొరికేవి కావు. కాని, కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి కూడా లేనందున ఈ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారింది. సర్కారు వెంటనే రెసిడెన్షియల్ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి.
– రాజ్‌కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
సమస్యలకు నిలయాలుగా రెసిడెన్షియల్ పాఠశాలలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెసిడెన్షియల్ పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు, విద్యుత్, కాస్మోటిక్స్, మెనూ ప్రకారం భోజనం అందించకపోవడం వంటి సమస్యలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు నేటికీ విద్యాశాఖమంత్రిని కూడా నియమించకపోవడం సిగ్గుచేటు. వెంటనే పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలి.
– మైలారం విజయ్‌కుమార్, బీజేవైఎం నాయకుడు