తాండూరు/కొడంగల్, మార్చి ; భూగర్భజలాలు అడుగంటడంతో వ్యవసాయ బోరుబావుల్లో నీరు ఇంకిపోతున్నది. దీంతో వరి పంట చేతికందే దశలో కాపాడుకునేందుకు అన్నదాతలు నానా తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందివ్వకపోవడంతో రూ.లక్షల్లో అప్పు చేసి కొత్తగా బోర్లు వేసుకున్నా ఫలితం ఉండడంలేదు. యాసంగి సీజన్లో బోరుబావుల కింద సాగుచేసిన పంటలు కొద్దిరోజుల్లోనే చేతికొస్తుందనుకున్న దశలో నీళ్లు పారకపోవడంతో ఎండిపోతున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న వరి చేను కళ్ల ముందే ఎండిపోతున్న రైతులు ఏమీ చేయలేకపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో రైతులు పాడి ఆవులు, మేకలు, గొర్రెలను ఎండుతున్న వరి చేనులో మేపుతున్నారు. ఇందుకు సాక్ష్యం జిల్లాలోని పలు గ్రామాల్లో చేతికొచ్చిన పంటలు ఎండిపోవడంతో పశువులను మేపుతున్న దృశ్యాలే. ఇన్ని రోజుల నుంచి రాని కరువు ఇప్పుడే రావాలా అని రైతులు కంటతడి పెడుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టామని, ప్రభుత్వమే ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.
16నీళ్లు ఇంకిపాయె..పంటలు ఎండిపాయె..
10 సంవత్సరాలకు ముందు వ్యవసాయం అంటే భయం వేసేది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అందించి బాసటగా నిలిచారు. పంట సాగు సమయానికి రైతు బంధు వచ్చేది, ఎవరికీ చేయి చాపకుండా సంతోషంగా వ్యవసాయం చేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎటువంటి మేలు చేయడంలేదు. ఈ సర్కారు వచ్చాకే కష్టాలు మొదలయ్యాయి. రైతు భరోసా ఇవ్వకపోవడంతో అప్పు చేసి పంట సాగు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రుణమాఫీ కూడా కాకపాయె. ఎట్లా సాగు చేసుకోవాలో అర్థం కావడం లేదు. చేసిన అప్పును తీరుస్తామా లేదా అనే భయం ఉన్నది. ప్రస్తుత యాసంగిలో ఒక ఎకరా 10 గుంటల్లో వరి పంట వేశా. నీళ్లు లేక వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో మళ్లీ అప్పు తెచ్చి రెండో పంటగా జొన్న పంటను సాగు చేశా. జొన్న పంట సాగు మధ్యలోనే ఉన్న బోరులో నీరింకిపోయింది. దీంతో జొన్న పంట మధ్యలోనే ఎండు దశకు చేరుకున్నది. రెండు పంటలకు మొత్తంగా రూ.లక్షా20వేలు ఖర్చు చేశా. కనీసం తాగడానికి, పశువులకు కూడా నీరందని పరిస్థితి ఏర్పడింది. నా భార్యతోపాటు నా కొడుకు, కోడలు వ్యవసాయం చేసుకునేవాళ్లం. కొడుకు చనిపోవడంతో కోడలు ముంబయికి వెళ్లింది. గతంలో ఎప్పుడు ఇంతస్థాయి లో కరువును చూడలేదు. ప్రభుత్వం రైతు కష్టాలను గుర్తించి ఆదుకోవాలి
– సోమ్లానాయక్, బోడబండతండా
నీళ్లు లేక.. దిక్కుతోచక..
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతులకు ప్రస్తుతం కన్నీరే మిగులుతున్నది. ఇన్ని రోజుల నుంచి రాని కరువు ఇప్పుడే వచ్చింది. మా బతుకులను ఆగం చేస్తున్నది. మూడెకరాల పొలంలో వరి పంట వేశా. పంట చేతికివస్తుందన్న సమయంలోనే బోరు అడుగంటడంతో నీళ్లు రావడంలేదు. దీంతో దిక్కుతోచక 3 ఎకరాల వరి చేను పశువులకు మేతగా వదిలేశా. రూ.80 వేలు పెట్టి పంటసాగు చేసిన. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఇచ్చినట్టు కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. అప్పు తెచ్చి పంటలు వేసిన. ఇప్పుడు ఇలా పంట ఎండిపోవడంతో నాకేమీ తోచడంలేదు. ఏడిచి ఏడిచి కన్నీళ్లు కూడా రావడం లేదు. ఇలా నాతో పాటు అనేక మంది రైతులు గోసపడుతున్నారు. యాసంగి ప్రారంభమై మూడు నెలలు దాటిపోతున్నా రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం (రైతు భరోసా) ఇంకా అందడం లేదు. ఆ డబ్బులన్నా వస్తే కాస్త బాగుండేది. రాష్ట్రంలో రైతుల బాధలు తీరాలంటే ఒక్క కేసీఆర్‌తో మాత్రమే సాధ్యమని మాకు ఇప్పుడు అర్థం అవుతున్నది. రేవంత్‌రెడ్డి నెరవేర్చని హామీలను ఇచ్చి ప్రజలందరినీ మోసం చేస్తున్నడు. పంట సాగు కోసం గతంలో కేసీఆర్ రైతుబంధు ఇచ్చినట్లే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతు భరోసా పేరుతో ఎకరానికి రూ.6 వేల చొప్పున ఏడాదికి రెండుసార్లు రూ.12 వేలు ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేదు. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధుతో వ్యవసాయం పండుగలా చేసుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో చాలా ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలి.
– కుర్వ రాములు, రైతు, తిమ్మాయిపల్లి
గతంలో రూ.5లక్షల వరకు ఆదాయం
గత బీఆర్ఎస్ పాలనలో ప్రతి సంవత్సరం అధిక పంట దిగుబడితో రూ.5లక్షల వరకు ఆదాయం వచ్చేది. మా కుటుంబానికి మొత్తంగా 3 ఎకరాల 20 గుంటల భూమి ఉంది. మా కుటుంబంలో అమ్మతోపాటు తమ్ముడు ఉన్నాడు. ముగ్గురం కలిసి వ్యవసాయం చేసుకొని సంవత్సరం పొడవునా వరి పంట సాగు చేస్తూ వస్తున్నాం. వర్షాకాలంలో వరి పంట సమృద్ధిగా వచ్చింది. ప్రస్తుత యాసంగిలో నీటి కొరత కారణంగా వేసుకున్న పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోతున్నది. అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాం. గతేడాది మాదిరిగా ఈసారి కూడా అధిక దిగుబడి వస్తుందనే ఆశ ఉండేది. మొదట్లో పంట ఏపుగా పెరిగి ఉండటాన్ని చూసి చాలా సంతోషించా. తీరా పంట చేతికి వచ్చే సమయంలో పొలంలోని బోరులో నీటి నిల్వలు పూర్తిగా పడిపోయాయి. రూ.లక్ష వరకు పంట పెట్టుబడి పెట్టినా. ఏండ్ల కాలంగా వ్యవసాయం చేస్తున్నా.. ఇలాంటి పరిస్థితి ఏనాడూ చూడలేదు. యాసంగి సీజన్లో రైతులు అన్నింటా కష్టాలను ఎదుర్కొవాల్సి వస్తున్నది. దిగుబడి దేవుడెరుగు.. పెట్టిన పెట్టుబడి, తెచ్చిన అప్పులను కొంతైనా తీర్చుకోవచ్చనే ఆశ కూడా లేకుండా పోయింది. అప్పట్లో రైతు బంధు సాగు చేసే సమయానికి చేతికందేది, దాంతో అప్పు చేయకుండానే సాగు చేసుకునేవాళ్లం. ఇప్పుడు ఎటువంటి ప్రభుత్వ సాయం అందడంలేదు. 10 సంవత్సరాల క్రితం బాధలను మళ్లీ చవిచూడాల్సి వస్తున్నది. ప్రభుత్వం రైతు కష్టాలను గుర్తించి నష్టాన్ని తీర్చేలా చర్యలు తీసుకోవాలి.
– అరుణ్‌కుమార్, రైతు, ఏర్పుమళ్ళ