జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎన్నో ఏండ్లుగా మరమ్మతులకు నోచుకోని రహదారుల్లోని గుంతల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నీళ్లు చేరడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడ గుంత ఉన్నదో.. ఎక్కడ లేదో తెలియక ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. రోడ్లకు మరమ్మతులు చేయించాలని పలుసార్లు అధికారులకు విన్నవించినా ఫలితంలేదని పలువురు వాహనచోదకులు, ప్రజలు పేర్కొంటున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నం మండలంలోని రాయపోల్ గ్రామంలో వర్షాలతో రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలుగడంతో ఆగ్ర హం వ్యక్తం చేసిన గ్రామస్తులు రోడ్డుపైనే వరినాట్లు వేసి నిరసన తెలిపారు.
రంగారెడ్డి, జూలై 26 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్-శ్రీశైలం రహదారి నుంచి ఫార్మాసిటీ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కందుకూరు నుంచి మీర్ఖాన్పేట్ వరకు నాలుగు లైన్ల రోడ్డును ఏర్పాటు చేసింది. ఈ రోడ్డు పనులు 90% వరకు గత ప్రభుత్వంలో పూర్తయ్యాయి. మీర్ఖాన్పేట్ సమీపంలో ఓ కల్వర్టు నిర్మాణం సందర్భంగా ఆ పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటుతున్నా ఆ పనులను పట్టించుకోకపోవడంతో ఆ రోడ్డుపై పెద్దఎత్తున గోతులు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షానికి ఆ గోతుల్లో నీరు చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో గ్రామానికి చెందిన పలువురు మహిళలు శనివారం రోడ్డుపైనే వరినాట్లు వేసి నిరసన తెలిపారు. వెంటనే కల్వర్టు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
మీర్ఖాన్పేట్ టు నజ్దిక్‌సింగారం వరకు..
కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్ నుంచి యాచారం మండలంలోని నజ్దిక్‌సింగారం వరకు రోడ్డు మరమ్మతులు మొదలుపెట్టి మధ్యలోనే వదిలేశారు. రోడ్డుపై కంకరపోసి వదిలేయడంతో వర్షాలకు కంకర పూర్తిగా తేలి వాహనదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
ప్రధాన రోడ్లపై దృష్టి సారించని ప్రభుత్వం
జిల్లాలో ఉన్న ప్రధాన రోడ్ల మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించడంలేదని ప్రజలు వాపోతున్నారు. మంచాల, యాచారం, ఆమనగల్లు, తలకొండపల్లి, ఇబ్రహీంపట్నం, కొందుర్గు, షాబాద్, షాద్‌నగర్ మండలాల్లో గ్రామాలను కలిపే ప్రధాన రోడ్లు అధ్వానంగా మారినా మరమ్మతులు చేపట్టడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రికార్డుస్థాయిలో నమోదైన వర్షపాతం
జిల్లాలో గత వారం రోజులుగా సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. శంకర్పల్లి, శేరిలింగంపల్లి, గండిపేట, రాజేంద్రనగర్, బాలాపూర్, సరూర్‌నగర్, హయత్‌నగర్, కేశంపేట, మహేశ్వరం, శంషాబాద్, మొయినాబాద్, చేవెళ్ల, కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌నగర్, కొందుర్గు, చౌదరిగూడ వంటి మండలాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. శనివారం 4.7 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతున్నది.
శంకర్పల్లి : మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ బ్రిడ్జి నుంచి వివేకానంద పాఠశాల వరకు రోడ్డు మొత్తం గతుకులమయంగా మారింది. అయితే ఆ గుంతల్లో గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నీళ్లు నిండి.. ఎక్కడ గుంత ఉన్నదో.. ఎక్కడ లేదో తెలియక వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముందుకు సాగితే ఎక్కడ కిందపడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. ఈ వానకాలం పూర్తయ్యే వరకైనా అధికారులు రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయించాలని వారు కోరుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
– నారాయణరెడ్డి, రంగారెడ్డి కలెక్టర్
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉండొద్దు. వాగులు, చెరువులు పొంగుతున్న నేపథ్యంలో వాటి వద్దకు వెళ్లొద్దు. విద్యుత్తు ప్రమాదాలు సంభవించే అవకాశాలుండడంతో ఆ శాఖ అధికారులూ అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, అత్యవసర సాయం కోసం 040 23237416కు ఫోన్ చేయాలన్నారు.