కొత్తూరు, అక్టోబర్ 18: పరిశ్రమల నుంచి వస్తున్న నీటి కాలుష్యంతో కాశన్న కుంటలో చేపలు మృతిచెందాయి. ఈ విషయాన్ని మత్స్యకారులు ఇరిగేషన్ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు వచ్చి చేపలను పరిశీలించి పొల్యూషన్ బోర్డు అధికారులకు సమాచారమిస్తామని చెప్పారు. వివరాల్లోకి వెళితే కొత్తూరు పట్టణాన్ని ఆనుకొని కాశన్నకుంట ఉంది. ఈ కుంట చుట్టూ చాలా పరిశ్రమలు ఉన్నాయి.
ఈ పరిశ్రమలను నుంచి వెలువడుతున్న కాలుష్య జలాల కారణంగా శుక్రవారం ఉదయం చేపలు పెద్ద ఎత్తున మృతి చెంది కన్పించాయి. దీంతో కొత్తూరుకు చెందిన మత్స్యకారులు ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇరిగేషన్ డీఈ ప్రతిమ, ఏఈ రవీందర్ చెరువు దగ్గరకు వెళ్లి పరిశీలించారు. వారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు సమాచారమిస్తామని మత్స్యకారులకు తెలిపారు.
కాలుష్యం బారిన చెరువులు..
కొత్తూరులో చాలా పరిశ్రమలు జల, వాయు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. దీనివల్ల కొత్తూరు మున్సిపాలిటీలోని చాలా చెరువులు కాలుష్యం బారిన పడుతున్నాయి. అంతే కాకుండా స్పాంజ్ అండ్ ఐరన్ పరిశ్రమలనుంచి విపరీతమైన పొగ వెలువుడుతుంది. దీంతో అక్కడ పనిచేసే కార్మికులతో పాటు కొత్తూరు పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పొల్యూషన్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి స్పందించడంలేదు. పొగవల్ల తమ పంటలు పాడవుతున్నాయని చాలా మంది రైతులు పొల్యూషన్ బోర్డుకు విన్నవించినా పట్టించుకోవడంలేదని చెబుతున్నారు.