Tanduru | తాండూరు, మార్చి 26 : తాండూరు నియోజకవర్గంలో మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు నిర్వాహకులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కాసులకు కక్కుర్తిపడి విచ్చల విడిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ప్రజల ఆరోగ్యం పాలిట శాపంగా మారుతున్నారు.
తాండూరు పట్టణంతో పాటు మండలాల్లో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లలో ఐఎస్ఐ ప్రమాణాలతో కూడిన ప్లాంట్లు, పరికరాలు ఏర్పాటు చేసి తాగునీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా ప్లాంట్లు కొనసాగడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఆటోలపై ఇంటింటికి తిరుగుతూ వేసే మంచినీళ్ల బాటిళ్లలో నాచు పేరుకుపోయిన అలాగే విక్రయించడం గమనర్హం. సంబంధిత శాఖ అధికారులు వాటర్ ప్లాంట్లను పరిశీలించి అనుమతులు లేకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కొనసాగిస్తున్న వాటర్ ప్లాంట్లను సీజ్ చేసి తగు చర్యలు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.
వేసవిలో ఎండ తాపం తట్టుకోలేక గొంతు చల్లార్చుకుందామని ఐస్ వేసిన జ్యూస్, లస్సీ, చెరుకుపాలు తదితర పానీయాలు తాగితే ఆరోగ్యం తుస్ మంటుంది. తడి గుడ్డతో గొంతుకోయడం అంటారే ఇదీ అంతే. ఐస్ వేసిన పానీయాలు తాగగానే గొంతులో చల్లగా ఉంటుంది. నిదానంగా ఆ చల్లదనం కడుపులోకి వెళ్లి మనస్సు ఉల్లాసమనిపిస్తోంది. అయితే కడుపులోకి చల్లదనంతో పాటు బ్యాక్టీరియా, ఇతర క్రిమి కీటకాలు ప్రవేశించి జీర్ణకోశ వ్యాధులకు దారి తీస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో పానీయాలు చల్లబరిచేందుకు ఉపయోగించే ఐస్గడ్డలన్ని పరిశ్రమల అవసరాల కోసం తయారు చేసేవే. చేపలు, రొయ్యలు, ఇతర పానీయాలు నిల్వ ఉంచిన పాత్రల బయట వైపు ఉపయోగించడానికి మాత్రమే ఈ ఐస్ వాడాలి. కానీ చెరుకురసం, లస్సీ, మజ్జిగ, పలు పండ్లు రసాల పానీయాల్లో విరివిగా ఐస్‌ను కలుపుతున్నారు. అయితే ప్రమాణాలు పాటించని ఐస్‌లో ఆరోగ్యాన్ని పాడుచేసే బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉంటాయి. కొందరు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఐస్‌ను తయారు చేస్తున్నారు. ఈ ఐస్ వేసిన పానియాలు తాగడం వల్ల మొదట చిన్న పేగు, పెద్ద పేగుల్లో బ్యాక్టీరియా చేరి ప్రాణాంతకరమైన వ్యాధులు సంభవిస్తాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అందుకనే ఐస్ వేయని పదార్థాలు తాగడమే ఉత్తమం. సంబంధిత అధికారులు ఐస్ ఫ్యాక్టరీలల్లో తనిఖిలు చేసి ప్రమాణాలు పాటించని నిర్వాహకులపై చర్యలుతీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.