వికారాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఎండలు ముదరకముందే భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. మార్చి నెలాఖరులోనే జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లో నీటినిల్వలు తగ్గడంతో ప్రమాద ఘటికలు మోగుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులు, చెరువుల్లో నీటినిల్వలు తగ్గి నెర్రెలు పడ్డాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమంతో పూడికతీత పనులు చేపట్టి చెరువులకు పూర్వ వైభవం తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే చెరువుల్లో నీరు లేక కళ తప్పాయి.
కేసీఆర్ ప్రభుత్వంలో చెరువులు, ప్రాజెక్టుల్లో పూడికతీత పనులతో మండు వేసవిలోనూ 90 శాతం మేర నీటినిల్వలు ఉండి భూగర్భజలాలకు ఎలాంటి ఢోకా లేని పరిస్థితులుండగా.. రేవం త్ సర్కార్లో చెరువులు, ప్రాజెక్టుల్లో పూడికతీత తీయించకపోవడం.. తూములు, కాల్వలు పాడైపోయినా వాటికి మరమ్మతులు చేయించకపోవడంతో నీరు నిల్వలేక అడుగంటిపోతున్నాయి. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన కోట్పల్లి, లక్నాపూర్, సర్పన్పల్లి, కాక్రవేణి, జుంటుపల్లి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు క్రమంగా తగ్గుతున్నాయి.
ఈనెల మొదటి వారం 90 శాతం వరకు నీటి నిల్వలుండగా, ప్రస్తుతం వాటిలో 50 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చెరువుల్లోనూ నీటి నిల్వలు తగ్గుతున్నాయి. మార్చి ముగియక ముందే చెరువుల్లో నీటి నిల్వలు 30 శాతానికి చేరుకున్నాయి. భూగర్భజలాలు అడుగంటుతుండడంతో బోర్లు, బావుల్లోనూ నీటినిల్వలు తగ్గిపోతున్నాయి. కాగా జిల్లాలో 1179 చెరువులుండగా.. 85,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. తాండూరు డివిజన్లో 262 చెరువులు, కొడంగల్ డివిజన్లో 202, పరిగి డివిజన్లో 398, వికారాబాద్ డివిజన్లో 317 చెరువులున్నాయి. 1179 చెరువులుండగా మెజార్టీ చెరువుల్లో 25-30 శాతం మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి.
మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వ వైభవం..
కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమంతో చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చింది. పూడికతీత పనులతో కనీసం ఐదు టీఎంసీలకు పైగా వృథాగా పారే నీటిని ఒడిసి పట్టేలా చెరువులను అభివృద్ధి చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో కట్టలకు పలు చోట్ల గండ్లు, తూములకు లీకేజీలతోపాటు అలుగులు పాడవడంతో కురిసిన వర్షం నీరు ఎక్కువగా వృథాగా పోయేది. దానిని అరికట్టేందుకు చెరువులు, కుంటల్లో పూడికతీతతో పాటు వాటికి మరమ్మతులు చేయించడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది.
సగటున 20-30 ఎకరాలకు నీరందించే చెరువు మిషన్ కాకతీయ పనులతో 120-130 ఎకరాలకు నీరందించే స్థాయికి చేరింది. మిషన్ కాకతీయ పనులతో జిల్లాలోని చెరువులు వేసవిలోనూ నిండుకుండలా దర్శనమిచ్చాయి. చెరువుల్లో నీటి నిల్వలు, భూగర్భజలాలు పెరగడంతో జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం కూడా గత పదేండ్లలో గణనీయంగా పెరిగింది. 2014 అక్టోబర్లో 2.50 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉండగా మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత పనులతో 5,88,977 ఎకరాలకు పెరిగింది. దాదాపు రూ.246 కోట్ల 95 లక్షలతో నా లుగు విడతల్లో 790 చెరువులను పునరుద్ధరించారు.