నర్సంపేట, మార్చి11 : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కు మక్కలు పోటెత్తాయి. యార్డు ఆవరణంతా ఆరబోసిన మక్కలే కనిపిస్తున్నాయి. గ్రామాల్లో సరైన కళ్లాలు, స్థలాలు లేక పోవడంతో ఎక్కువ మంది రైతులు మార్కెట్కు తరలివస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేక, మద్దతు ధర లభించక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్లో కూడా మక్కలు ఆరబోసేందుకు స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు.
కాగా, మార్కెట్లో తేమ 15 శాతం వరకున్న మక్కలను మాత్రమే ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు మార్కెట్ యార్డులో రోజల తరబడి ఆరబోసి తేమ వచ్చిన తర్వాతే విక్రయిస్తున్నారు. ఇందుకోసం రాత్రి, పగలు తేడా లేకుండా రోజుల తరబడి యార్డులోనే గడుపుతున్నారు. మక్కలు ఆరబెట్టేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. తాగు నీరు అందుబాటలో లేకపోవడంతో బయట కొనుక్కుంటున్నారు.
1.08 లక్షల ఎకరాల్లో సాగు..
వరంగల్ జిల్లాలో 1,08,100 ఎకరాల్లో రైతులు మక్కజొన్న సాగు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలోని నెక్కొండ మండలంలో 12,500 ఎకరాలు, చెన్నారావుపేటలో 10,600, దుగ్గొండిలో 13,500, నల్లబెల్లిలో 14,500, నర్సంపేటలో 8,500, ఖానాపురంలో 5,000, గీసుగొండలో 12,900, ఖిలావరంగల్లో 2,500, పర్వతగిరిలో 5,500, రాయపర్తిలో 5,000, సంగెంలో 10,600, వరంగల్లో 1,400, వర్ధన్నపేటలో 5,600 ఎకరాల్లో రైతులు పంట వేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.