కులకచర్ల, మే 19 : చెరువుల పునరుద్దరణలో భాగంగా గతంలో బీఆర్ఎస్ సర్కారు మిషన్ కాకతీయ ద్వారా చర్యలు తీసుకోవడంతో చెరువుల్లో నీళ్లు నిల్వ ఉండేవి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తాము గోస పడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. కులకచర్ల మండలంలో ముజాహిద్పూర్ అక్కమ్మ చెరువు, కామునిపల్లి కాముని చెరువు, అంతారం పాటిమీది చెరువు, కులకచర్ల మైలమ్మ చెరువు, ఇప్పాయిపల్లి చెరువు, వీటితోపాటు చాలా చెరువులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పునరుద్ధరించబడ్డాయి.
కాని అవే చెరువులను ప్రస్తుత సర్కారు పట్టించుకోకపోవడంతో నిండుకుండలా ఉన్న చెరువులు ఒట్టిపోతున్నాయి. గతంలో చెరువుల కింద మూడు పంటలు పండిస్తే నేడు రెండు పంటలు కూడా పండించలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామునిచెరువు కింద సుమారు 500 ఎకరాల సాగు గతంలో జరుగగా.. ఈ సంవత్సరం కనీసం 200 ఎకరాలూ సాగు చేయలేక పోయారు. గతంలో కులకచర్లలో ఉన్న మైలమ్మ చెరువు కింద 700 ఎకరాల వరకు సాగు చేయగా.. నేడు 300 ఎకరాలు., ముజాహిద్పూర్ అక్కమ్మ చెరువు కింద 800 ఎకరాలు సాగు చేయాల్సి ఉండగా కనీసం 300 ఎకరాలు కూడా సాగు చేయలేకపోయారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే చెరువుల పునరుద్ధరణ జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో పూడికతీతతోపాటు కట్టలు, తూముల మరమ్మతులు చేసి చెరువుల్లో నీళ్లు పూర్తిస్థాయిలో నిలిచేలా ఉండేది. రైతులు ప్రతి సంవత్సరం మూడు పంటలు సాగు చేసేవారు. కాని నేడు చెరువుల్లో నీళ్లు పూర్తి స్థాయిలో ఎండిపోవడంతో పంటలు సాగు చేసే పరిస్థితులు లేవు.
– పాల మహిపాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్, కామునిపల్లి, కులకచర్ల మండలం
ప్రస్తుత ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. చెరువుల కింద వేసిన పంటలు పూర్తిస్థాయిలో నీళ్లు సరిపోక ఎండిపోయాయి. దీంతో రైతులకు పెట్టుబడి కూడా రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలి. గతంలో రైతుల పట్ల శ్రద్ధ ఉండేది.. అదే శ్రద్ధ ఈ ప్రభుత్వం కూడా చూపించాలి. రైతులు సంతోషంగా ఉంటేనే దేశం, రాష్ట్రం, ప్రజలు సంతోషంగా ఉంటారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.
– మఠం రాజశేఖర్, మందిపల్, చౌడాపూర్ మండలం