పిల్లలు, పెద్దలు, వృద్ధులు, పురుషులు, స్త్రీలు, ధనికులు, సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు అనే బేధాలు లేకుండా వారికున్న అనుకూలతను బట్టి వ్యాయామానికి సమయం కేటాయించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య పరిరక్షణకు చికిత్స, మందుల వాడకానికే పరిమితం కాకుండా వాకింగ్, జాగింగ్‌తో పాటు జిమ్, యోగా ఇతర మానసిక, శారీరక అలసటకు సంబంధించిన వ్యాయామాలు చేస్తూ పుష్టికరమైన సంతులిత ఆహారం, పండ్లు, పండ్ల రసాలు తదితర పదార్థాలు సమపాళ్లల్లో తీసుకుంటే ఎటువంటి ప్రాణాంతక వ్యాధులు, జబ్బులకైనా చెక్ పెట్టవచ్చనేది వైద్యులు, వ్యాయామ నిపుణుల అభిప్రాయం.
వయస్సుకు, పరిమితికి మించిన అధిక బరువే మనిషికున్న అసలైన పెద్ద సమస్య. సమాజంలో 30నుంచి 50శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మానవదేహాన్ని అనేక రోగాలకు గురిచేసే అంశం ఊబకాయం. అధిక బరువుతో బాధపడేవారు భవిష్యత్‌లో మధుమేహం, కీళ్లనొప్పులు, కాలేయ సమస్యలు, గుండెజబ్బులతో పాటు అనేక రకాల మానసిక, శారీరక రుగ్మతులకు గురవుతారు. రోజురోజుకూ పెరుగుతున్న ఒబెసిటి సమస్యలపై జాతీయ పోషకాహార సంస్థ తీవ్ర ఆందోళన చెందుతున్నది. అయితే ఈ ఊబకాయాన్ని తగ్గించుకునేందుకు కొందరు కృత్రిమ పద్ధతుల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల అనేక రకాల సమస్యలు ఎదురవుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని కొద్దివరకు తగ్గించాలంటే ప్రతి చిన్న పనికి కారు, మోటారుసైకిల్‌ను వినియోగించకుండా సాధ్యమైనంత వరకు నడిస్తే మంచిదని చెబుతున్నారు.
మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే ఆహార పదార్థాలు వ్యాయామంతో పాటు ఆరోగ్య నియమాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. ఆరోగ్య నియమాల్లో అతి ముఖ్యమైనవి చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దేహ పరిరక్షణ, మనంరోజూ ఎంతో మందితో కరచాలనం చేస్తుంటాం. ఏవేవో అపరిశుభ్ర ప్రదేశాలను మనకు తెలియకుండానే ముట్టుకుంటాం. నిత్యం చేసే పనులన్నీ దాదాపు చేతులతోనే కానిస్తాం. అవే చేతులతో ఏదో ఒకటి తింటుంటాం. అందుకే చేతులను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. కనీసం వారినికి ఒకసారి గోళ్లను కత్తిరించుకోవాలి. సామాన్యంగా కళ్లకు కనబడనంత సూక్ష్మజీవులు ఉంటాయి. అవి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నవెంటనే ప్రతి ఒక్కరూ చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామంతో పాటు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. సాధారణంగా నిత్యం తీసుకునే ఆహార పదార్థాల విషయాల్లో ఎటువంటి నియమాలు, పరిమితులు పాటించడంలేదనేవి జగమెరిగిన సత్యం. పౌష్టికాహార నియమాలు పాటించని 90శాతం శరీరాలు విభిన్నరోగాలు, వ్యాధుల బారిన పడుతున్నట్లు ఆరోగ్యసంస్థ నివేదికలు చెబుతున్నాయి. సమతుల్య ఆహారానికి ప్రాధాన్యం ఇచ్చినట్లయితే శరీరాన్ని రోగాల బారీనుంచి కాపాడుకోవచ్చు. ముఖ్యంగా నూనె పదార్థాలు పరిమితంగా వాడటం, మాంసకృత్తులు, ప్రొటీన్లు, కార్బోహైడ్రెడ్ సమపాళ్లలో లభించేలా పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లు, తదితర పదార్థాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మాంసాహారులు పప్పుదినుసుల స్థానంలో అప్పుడప్పుడు గుడ్డు, చేపమాంసం తీసుకుంటే ఎంతో మంచిది.
అందమైన ఆరోగ్యానికి శాశ్వత సంజీవని యోగా అంటారు. యోగా అంటే కలయిక అని అర్థం. మానసిక ప్రశాంతత ఈ యోగాతోనే సాధ్యం. యమ, నయన, ఆసన, ప్రాథాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన సమాధి అని ఎనిమిది విధానాలు యోగాలో ఉంటాయి. వీటిని అస్టాంగ యోగం అని అంటాం. మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, తదితర సమస్యలన్నింటికీ చక్కని పరిష్కార మార్గం యోగా. దీర్ఘకాలిక, మొండి వ్యాధులను తగ్గించే శక్తి యోగాకు ఉందని నిపుణులు అంటున్నారు. జీర్ణకోశ వ్యాధులు, నీరసం, నిద్రలేమి, నరాల బలహీనత వంటి రుగ్మతల నుంచి తేలికగా బయటపడే వీలు ఉంటుంది. యోగా ద్వారా ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లను కూడా మాన్పించవచ్చు అని యోగా గురువులు చెబుతున్నారు. ఉదయం 5గంటల నుంచి 7గంటల లోపు 45నిమిషాల పాటు క్రమం తప్పకుండా యోగా చేయడంతో పాటు అరచేతులు, అరికాళ్లపై తగిన విధంగా మర్థనా చేస్తే అంతుచిక్కని వ్యాధులు మాయమై, రోగాలతో దవాఖానల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటుంది. బతికినంతకాలం ఆరోగ్యంగా జీవించాలనే తపన ఉంటుంది. వ్యాధులను అధిగమించాలనే ఆసక్తి, లక్ష్యం ఉంటాయి. వీటన్నింటికీ ఒకటే మార్గంగా వాకింగ్, జాగింగ్ చేస్తూ క్రీడా మైదానాలు, పార్కుల వైపు పరుగులు తీస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు కొంతమందికి చలి వాతావరణం అనుకూలించక పోవడం, వయస్సు, శారీర తారతమ్యాలు, తదితర కారణాలతో బయటి ప్రాంతాలకు రాకుండా ఇంటి వరండాలు, వాకిళ్లు, డాబాలపై వాకింగ్, జాగింగ్ చేస్తున్నారు. మరికొంతమంది సంపన్న వర్గాలు పని ఒత్తిడి వల్ల తమకున్న ఖాళీ సమయంలో కొంత వెసులుబాటు కల్పించుకుని వ్యాయామం చేస్తున్నారు. హోమ్ జిమ్‌లను ఏర్పాటు చేసుకుని కుటుంబ సమేతంగా కరసత్తు చేస్తున్నారు. తమ ఆరోగ్యాన్ని, ఫిట్నెస్ను కాపాడుకునేందుకు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వ్యాయామంతో కుస్తీ చేస్తున్నారు. ప్రతిరోజూ కనీసం అరగంట అయినా జాగింగ్ చేస్తే ఎంతో మేలు జరుగుతుంది.
చిన్నారులు ఎదుగుతున్న కొద్దీ వారి దేహానికి, బుద్ది వికాసానికి కావాల్సినంత పౌష్టికాహారాన్ని అందించాలి. ఇలా అధిక పోషకాహార విలువలు కలిగిన ఆహారం అందించినప్పుడు అప్పుడే పుట్టినబిడ్డ బరువు కేవలం ఐదు నెలల్లో రెట్టింపు అవుతుంది. ఏడాది నిండే సరికి మూడురెట్లు బరువు పెరుగుతుంది. రెండో ఏడాదిలో 7నుంచి 8సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతారు. కౌమర దశలో అడుగు పెట్టినప్పటి నుంచి వారిలో అనేక శారీరక, మానసిక మార్పులు కనిపిస్తాయి. ఇది కీలకమైన దశ, ఈ దశలో ఉన్న పిల్లలకు సరిపడా సమతుల్య ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా కాల్షియం సమృద్ధిగా అందించాలి. ప్రతి మనిషికి రోజుకు 600నుంచి 800గ్రాముల కాల్షియం అవసరమవుతుంది.
ఎదిగే వయస్సులోని పిల్లకు ఇంకాస్త ఎక్కువగా అవసరం ఉంటుంది. పాల ద్వారా కాల్షియం సమృద్ధిగా లభించే అవకాశం ఉంది. మార్కెట్లో లభించే చిరుతిండికి పిల్లలను అలవాటు చేయొద్దు. చిన్నతనం నుంచే పౌష్టికాహారంపై చిన్నారులకు అవగాహన కల్పిస్తూ ఇంటిలో ఉడికించిన పదార్థాలకు అలవాటు చేయాలి. లావు అవుతారనే ఆలోచనతో ఆహారం అందించే విషయంలో వెనుకాడకుండా, వారి సామర్థ్యాన్ని బట్టి శారీరక శ్రమకు సమయాన్ని కేటాయించేలా రోజు ఆటలు, వ్యాయామాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. చిన్నారులకు ఆహార నియమాలు, శారీరక శ్రమతో పాటు రోజుకు కనీసం 8నుంచి 10గంటలు నిద్ర తప్పనిసరి అవసరం. అంతేకాకుండా పిల్లలకు చిన్నప్పటి నుంచే వ్యాయామం తప్పనిసరిగా అలవాటు చేయాలి.
వృద్ధులకు విశ్రాంతి, మానసిక ప్రశాంతత, శారీరక బలం అవసరం. అయితే వయస్సు మీద పడుతున్న కొద్దీ ప్రతి వ్యక్తికి సాధారణంగానే కొన్ని సమస్యలు పెరుగుతూ ఉంటాయి. వృద్ధాప్యంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండదు. కాబట్టి కాలరీల సామర్థ్యం తగ్తున్నది. సాధారణ వ్యక్తులకు రెండువేల కాలరీల సామర్థ్యం అవసరం. వృద్ధాప్యంలో ఉన్నవారికి మాత్రం 1,800కాలరీలు సరిపోతుంది. ఆహార పదార్థాల విషయానికొస్తే వృద్ధాప్యంలో నూనె, నెయ్యి, వెన్న, వనస్పతి వాడకం దాదాపుగా తగ్గించుకోవాలి. పాలు, పప్పు ధాన్యాలు, కోడిగుడ్డు తెల్లసొన మేలు చేస్తాయి. రోజుకు 200 నుంచి 300 మిల్లీలీటర్ల పాలు, పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తం. కనీసం 400 గ్రాముల కూరగాయలు, పండ్లు తినాలి. ఉప్పు, మసాలాలు బాగా తగ్గించాలి. కాల్షియం, విటమిన్ -ఏ, జింక్ వృద్ధాప్య సమస్యలను అధిగమించటంతో సహాయ పడతాయి. వైద్యుల సహకారంతో వ్యాయామ పద్ధతులు ఎంచుకోవాలి.
కుర్రకారు సిక్స్‌ప్యాక్, ఫర్ ఫెక్టు బాడీలతో వెర్రిత్తించాలనే ఆసక్తితో జిమ్‌లు, ఫిట్నెస్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. యువత ఉత్సాహానికి అనుగుణంగా వ్యాయామ కేంద్రాలూ పెరిగాయి. శారీరాకృతికి అనువైన ఫిట్నెస్ పరికరాల వినియోగం పెరిగింది. ఉమ్మడి జిల్లాలోని పట్టణాల్లో జిమ్ సెంటర్లు వెలిశాయి. యువత అభిరుచులకు అనుగుణంగా అధునాతనమైన పరికరాలతో అక్కడ వ్యాయామాలు చేస్తున్నారు.
ఫిట్‌నెస్‌పై అందరూ దృష్టి సారిస్తున్నారు. వ్యాయామ కేంద్రాలు విస్తరిస్తుండటంతో ఫిట్నెస్ పరికరాల వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. దీంతో వ్యాపారులు కొందరు ఈ పరికరాల కోసం ప్రత్యేక దుకాణాలనే నెలకొల్పుతున్నారు. గతంలో ఫిట్నెస్ పరికరాలను సుదూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తీసుకువచ్చేవారు. ప్రస్తుతం పరికరాల తయారీ స్థానికంగానే అందుబాటులోకి రావడంతో ఫిట్నెస్ సెంటర్లతో పాటు వ్యక్తిగతంగా కొనుగోలు చేసి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వ్యాయామానికి ఉపయోగించే పరికరాల్లో హోంజిమ్, మల్టీజిమ్, ఆబ్డామినల్, జాగర్స్, డంబెల్స్, ఏబీక్సర్సైజ్, లిఫ్ట్క్రాస్ ట్రైనర్, సీఆర్టీట్రాక్, ట్రెడ్మెట్, జియానసైక్ బాల్స్ వంటివి ఉన్నాయి. ఈ పరికరాలు రూ.500 నుంచి మొదలయ్యి రూ.లక్షల వరకు ధర పలకటం విశేషం.
కాలం మారుతున్నది.. కాలంతో పాటు వాతావరణం మారుతున్నది.. కాలుష్య కారకాలు మారుతున్నాయి.. మనిషి కూడా యాంత్రికంగా మారుతున్నాడు.. బిజీ లైఫ్‌లో మనుషులు తీసుకునే ఆహార నియమాలు మారుతున్నాయి.. మరి ఇన్ని మారుతున్నప్పుడు అవి ప్రభావం చూపే మనుషుల ఆరోగ్య పరిస్థితి ఎందుకు మారదు..? కచ్చితంగా మారుతుంది. అనేక రకాల వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో అనేక మంది బాధపడుతున్నారు. వైరల్ ఫీవర్, మలేరియా, డెంగీ, ప్లేట్లెట్స్ పడిపోవటం వంటి జబ్బులతో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఊబకాయం, రక్తపోటు, మధుమేహం, గుండె వ్యాధులు విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి. వీటన్నింటికీ కారణం ఆహార నియమావళి అదుపు తప్పడం, శరీరానికి సరైన వ్యాయామం లేక పోవడమేనని అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీలేఖ.
– ఇబ్రహీంపట్నంరూరల్, డిసెంబర్ 17
ఉరుకులు.. పరుగుల జీవితంలో ప్రజలు ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవటంతో పాటు సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవటం వలన అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. వీటన్నింటిని అధిగమించేందుకు ప్రతిరోజూ వ్యాయామం, జిమ్, జాగింగ్లు చేయటంతో పాటు ఆహారం విషయంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి వ్యాధులు దరిచేరవు. ప్రతిరోజు మనిషికి యోగా ఎంతో అవసరం. యోగా చేయటం వలన ఎలాంటి రోగాలు ధరిచేరవు.
– దినేష్, ప్రముఖ వైద్య నిపుణుడు