ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 1 : రంగారెడ్డి జిల్లాలో కొత్త ఓటర్ల నమోదు కోసం అధికారులు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 7,369 పోలిం గ్ కేంద్రాల్లో శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు అందుబాటు లో ఉండి నూతన ఓటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈనెల 19 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నది. కాగా ఓటర్ల నమోదు కార్యక్రమంపై అధికారులు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
జిల్లాలో ఇప్పటివరకు 31,98,229 మంది ఓటర్లున్నారు. అందులో 16,62,692 మంది పురుషులుండగా 15,35,537 మంది మహిళా ఓటర్లున్నారు. ఇందులో 384 మంది థర్డ్‌జెండర్స్ ఉన్నారు. కొత్త గా నమోదు చేసుకున్న వారిని అదనపు జాబితాలో చేర్చనున్నారు. ఈనెల 19వరకు ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి కానున్నది.
జిల్లాలో కొత్తగా ఓటర్ల నమోదు కోసం నేడు, రేపు నిర్వహిస్తున్న స్పెషల్డ్రైవ్ను 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. బీఎల్వోలు రెండు రోజులపాటు ఆయా పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటారు. అర్హులు వినియోగించుకోవాలి. అనంతరెడ్డి, ఆర్డీవో, ఇబ్రహీంపట్నం