పెద్దఅంబర్‌పేట, సెప్టెంబర్ 6 : గణపతి నిమజ్జనం అంటే.. వెలుగులు జిగేల్మంటాయి.. డీజే సౌండ్లతో దద్దరిల్లుతాయి.. బ్యాండ్ బాజాలు కాలు కదిపేలా చేస్తాయి.. రంగురంగుల పేపర్లు గాల్లో నుంచి ఎగిరిపడుతుంటాయి.. ఉత్సాహంతో యువత కేరింతలు ఆకట్టుకుంటాయి.. గణపతి బప్పా మోరియా.. అంటూ నినాదాలతో భక్తిభావం వెల్లివిరిస్తుంది.. కానీ, ఇదంతా ఇప్పుడు గణపతి స్వాగతోత్సవాల్లోనూ కనిపిస్తున్నది. ఆగమనం అదుర్స్ అనేలా వినాయకుడి ప్రతిమలను తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఆడంబరంగా నిర్వహిస్తున్నారు. ఖర్చు ఎక్కువైనా పర్లేదు.. కానీ తగ్గేదేలే అంటున్నారు. రెట్టించిన ఉత్సాహంతో గణపతులకు వెల్కమ్ చెబుతున్నారు.
వేదిక వరకు వేడుకగా..
వినాయక చవితి అంటేనే యువత పండుగ. నవరాత్రులు వేడుకలు జోరుగా సాగుతాయి. నిమజ్జనం మరింత అట్టహాసంగా సాగుతుంది. కానీ, ఇటీవల ఆగమన కార్యక్రమాన్నే అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం నిర్వాహకులు ముందుగానే ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గణపతి ప్రతిమ కొనుగోలు మొదలు ప్రతిష్ఠాపన చేసే వేదిక వరకు ఓ పండుగ వాతావరణంలో తీసుకొస్తున్నారు. గణపతి ప్రతిమను బుక్ చేశాక.. తీసుకెళ్లే వాహనాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.
విద్యుత్తు బల్బులు ఏర్పాటు చేస్తున్నారు. డీజేలు ఏర్పాటు చేసి లైటింగ్ మధ్య స్వాగతం పలుకుతున్నారు. స్థానికంగా వినాయకుడిని ప్రతిష్ఠించే స్థలానికి సమీపంలోని చౌరస్తా నుంచి ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. కొందరు వినాయకుడి విగ్రహం కొనుగోలు చేసిన ప్రాంతం నుంచే బ్యాండ్ మోతలు, నృత్యాలతో గణపతికి స్వాగతం చెబుతున్నారు. గణపతి విగ్రహాల కొనుగోలుకు రూ. 20 వేల నుంచి లక్ష వరకు పెడుతుండగా.. ఇంకొందరు ఆపైనే వెచ్చించి ప్రతిమలు కొనుగోలు చేస్తున్నారు.
ఇప్పటికే చాలామంది ముందస్తుగా ఆర్డర్లు ఇచ్చి తమకు నచ్చినట్టుగా విగ్రహాలను తయారు చేయించుకున్నారు. వాటి ఆగమనానికి రూ.వేలు వెచ్చిస్తున్నారు. ఆగమనం అద్భుతం అనేలా అనిపించుకోవాలనుకుంటున్నారు. వారం రోజుల ముందు నుంచే ఈ వినాయక ఆగమన కార్యక్రమాలు మొదలు కాగా, శుక్రవారం ఈ కార్యక్రమాలు మరింత ఊపందుకున్నాయి. గణపతి ప్రతిమల కొనుగోలు కేంద్రాల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు సందడి సందడిగా మారింది. పలువురు విగ్రహాల కొనుగోలు కేంద్రాల వద్దే బ్యాండ్లు మాట్లాడుకుని ఊరేగింపు మొదలు పెట్టారు. ఇంకొందరు ఇప్పటికే బుకింగ్ చేసిన డీజేలు, బ్యాండ్లతో కలిసి ఊరేగింపు నిర్వహిస్తున్నారు. యువత పెద్ద ఎత్తున పాల్గొంటూ.. పండుగకు ముందే పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు.