కులకచర్ల, మే 20: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించేవరకు సమ్మెను కొనసాగిస్తామని వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల వీవోఏ సంఘం నాయకులు పేర్కొన్నారు. బుధవారం కులకచర్ల మండల కేంద్రంలో మండల మహిళా సమాఖ్య ఆవరణలో మండల వీవోఏల సమాఖ్య ఆధ్వర్యంలో సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు పలువురు వీవోఏలు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. చాలీచాలని వేతనాలతో తమ కుటుంబాలను నెట్టుకొస్తున్నామని, కనీసవేతనం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం తమను వెట్టి చాకిరి చేయిస్తుందని తెలిపారు.
కేవలం 5వేల వేతనంలో రాత్రింబవళ్లు పనిచేస్తున్నామని అన్నారు.
వీవోఏలకు కనీసం 20వేల వేతనం అందించాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ వర్తింప జేయాలని, అర్హులైన వీవోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించాలని, వీవోఏలకు సాధారణ, ఆరోగ్య బీమా 20లక్షలు కల్పించాలని, ప్రభుత్వం తమతో ఎక్కువగా ఫోన్లతో యాప్‌లతో పనిచేయిస్తుందని, దీనికి గాను వీవోఏలకు ట్యాబులు ఇవ్వాలని, 58జీవోను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో వీవోఏల సంఘం అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి లలిత, కోశాధికారి గోపాల్‌రెడ్డి, వీవోఏలు శివరాములు, నర్సింలు, చంద్రయ్య, రమేశ్, కల్పన, మహేశ్వరి, వీవోఏలు పాల్గొన్నారు.