తాండూరు, ఏప్రిల్ 24: పెరుగుతున్న అవసరాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ సర్కార్ పారిశ్రామికీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. నాపరాతి, సుద్దగనులకు ప్రసిద్ది గాంచిన తాండూరును అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి తాండూరు మండలం జిన్గుర్తి పంచాయతీ పరిధిలోని సర్వేనంబర్ 206లో 260 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం 45 ఎకరాల ప్రభుత్వ భూమి పారిశ్రామిక పార్కుకు కేటాయిస్తూ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అక్కడే ఉన్న మరో 215 ఎకరాల అసైన్డ్ భూమిని ఇటీవల టీఎస్ ఐఐసీ ప్రతినిధులు పరిశీలించి ఆమోదం తెలిపారు. భూమి చదునుతో పాటు భూమి కోల్పుతున్న రైతులకు సహకారం అందించేందుకు ప్రభుత్వం రూ.11 కోట్లును విడుదల చేసింది. దీంతో పారిశ్రామిక పార్కు ఏర్పాటు ప్రక్రియ మరింత వేగవంతమైనది. త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించనున్నట్లు ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు తెలిపారు.
యువతకు ఉపాధి అవకాశాలు..
సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమంతో పాటు యువతకు ఉపాధి కల్పించడానికి కృషి చేస్తున్నారు. ఇదే తరహాలో వాణిజ్య, వ్యాపారానికి మంచి పేరు గాంచిన తాండూరులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే కార్యాచరణతో నవాల్గాలో ఇండస్ట్రియల్ పార్కు, జిన్‌గుర్తిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేశారు. నవాల్గాలో ఇండస్ట్రియల్ పార్కుకు సరైన స్థలం లభించకపోవడంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్న జిన్గుర్తి గేట్ సమీపంలోని 260 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కుకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. దీంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వికారాబాద్ సమీపంలోకి మార్చి, పారిశ్రామిక పార్కును జిన్గుర్తి సమీపలంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఇక అన్నివిధాలా అనుకూలం ఉండడంతో అతి త్వరలో పనులకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో తాండూరు ప్రజలతో పాటు నాపరాతి వ్యాపారులకు కూడా మేలు జరుగనున్నది.
రూ.27 కోట్లతో హైవే పనులు..
నిత్యం రాకపోకలు, వర్షంతో దెబ్బతిన్న తాండూరు నియోజకవర్గ పరిధిలోని ఆర్‌ఆండ్‌బీ రోడ్లు ఇక సాఫీగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రత్యేక నిధులు కేటాయించి టెండర్లకు ఆహ్వానం పలికారు. ముఖ్యంగా తాండూరు పట్టణంలోకి వచ్చే ప్రధాన మార్గాల రోడ్లు బాగులేకపోవడంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చక్కటి రోడ్లు వేసేందుకు శ్రీకారం చుట్టారు. 167 నేషనల్ హైవేలో భాగంగా రూ.27కోట్లతో తాండూరు కాగ్నానది-గౌతాపూర్ వరకు రోడ్డుపనులను ఇటీవలే ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ప్రారంభించారు. రూ.631 కోట్లతో మహబూబ్‌నగర్-చించొల్లి రోడ్డు పనులకు వారంలో టెండర్లు జరుగనున్నట్లు సమాచారం. సిమెంట్ ఫ్యాక్టరీల భారీ వాహనాలు ఎక్కువగా తిరిగే గౌతాపూర్- కరణ్‌కోట్ రోడ్డు వేసేందుకు సర్కార్ ఆమోదం లభించింది. త్వరలో టెండర్లు వేసి పనులు ప్రారంభం కానున్నాయి. జిన్గుర్తి-తట్టెపల్లి రోడ్లతో పాటు త్వరలో బైపాస్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.
కాలుష్య రహిత తాండూరు దిశగా..
తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్ మండలాల్లో వేల ఎకరాల్లో ఉన్న నాపరాతి నిక్షేపాలతో పాటు తాండూరు మున్సిపల్ పరిధిలో 1000 వరకు ఉన్న పాలిషింగ్ యూనిట్లను ఏకతాటిపైకి తీసుకువచ్చి జిన్‌గుర్తిలో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ పార్కుకు తరలించడంతో తాండూరు మున్సిపాలిటీ కాలుష్యరహిత ప్రాంతంగా మారే అవకాశం ఉంది. దీనికి ప్రభుత్వం సానుకూల వైఖరి తెలుపడంతో పారిశ్రామిక వార్డు పనులకు మోక్షం లభించింది. పనులకు ప్రత్యేక నిధులు కూడా కేటాయించడంతో భూ సేకరణ పనులు జరుగుతున్నాయి. మరో వైపు తాండూరు నలుమూల బైపాస్ పనులతో పాటు తాండూరు కాగ్నానది-గౌతాపూర్ వరకు 167 హైవే పనులు, జిన్గుర్తి-తట్టెపల్లి రోడ్డుపనులు జరుగుతుండడంతో తాండూరు కాలుష్య రహితంగా మారుతుందని నేతలు, ప్రజలు, యువత సంతోషం వ్యక్తం చేస్తు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
కాలుష్యరహిత తాండూరుకు కృషి
కాలుష్యరహిత తాండూరు మున్సిపాలిటీ ఏర్పాటుతో పాటు అన్ని విధాలా సౌకర్యం, వనరులు సమృద్ధిగా అభివృద్ధిలో నంబర్-1గా చేయాలనే సంకల్పంతో పనులు చేస్తున్నాం. ముఖ్యంగా తాండూరు నియోజకవర్గ యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. పారిశ్రామిక పార్కు ఏర్పాటుతో నాపరాతి వ్యాపారులకు కూడా చాలా మేలు జరుగుతుంది. తాండూరు నియోజకవర్గంలో బైపాస్, హైవే రోడ్లతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల రోడ్ల పనులకు ప్రత్యేక నిధులు కేటాయించి పనులు ప్రారంభించాం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నాం.
– రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్యే తాండూరు
ఇండస్ట్ట్రియల్ పార్కుతో మంచి జరుగుతుంది
తాండూరు ప్రాంతంలో పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయడంతో మా నాపరాతి వ్యాపారులకు మరింత మంచి జరుగుతున్నది. ఓకే చోట పాలిషింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయడంతో వ్యాపారం మరింత బాగుంటుందని అనుకుంటున్నాం. తాండూరు నాపరాతి ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచినది. ఇది మరింత మెరుగు పరుచుటకు మంచి అవకాశం. ఒకే చోట నాపరాతి పరిశ్రమలు ఉండడంతో వ్యాపారానికి అనుగుణంగా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు అనుగుణంగా బైపాస్ రోడ్డు వేయడం కూడా చాల మంచిది.
– మన్మోహన్సార్డా, నాపరాతి వ్యాపారి
పారిశ్రామిక పార్కుకు రూ.11 కోట్లు
జిన్గుర్తి గేట్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కు భూసేకరణ, ఇతరత్రా పనులకు ప్రస్తుతం రూ.11 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 45 ఎకరాల ప్రభుత్వ భూమి ఇండస్ట్రియల్ పార్కుకు ఇచ్చింది. 215 ఎకరాల అసైన్డ్ భూమి సేకరణ పనులు జరుగుతున్నాయి. త్వరలో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. దీంతో తాండూరు ప్రాంతంలో ఉన్న నాపరాతి పరిశ్రమలు ఒకే స్థలంలోకి రానున్నాయి.
– అశోక్‌కుమార్, ఆర్డీవో తాండూరు