పరిగి, ఏప్రిల్ 22 : గనుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఈసారి భారీగా పెరిగిందని చెప్పవచ్చు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అదనపు ఆదాయం రావడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వికారాబాద్ జిల్లా పరిధిలో గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి రూ.83.63కోట్లు ఆదాయం చేకూరింది. దీంతోపాటు డీఎంఎఫ్టీ కింద రూ.23.80 కోట్లు సమకూరాయి. గత మూడు నాలుగు ఏండ్లతో పోలిస్తే ఈసారి ప్రభుత్వానికి గనుల శాఖ ద్వారా మరింత ఆదాయం పెరిగింది. ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరింత పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సీనరీ చార్జీలు పెరుగడం ద్వారా మరింత ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉన్నది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సీనరేజ్ పెంపు అమలులోకి రావడం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా ఆదాయం వస్తుంది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా తాండూరు ప్రాంతంలోని గనుల ద్వారానే సమకూరుతుంది.
జిల్లాలో 221 లీజుల ద్వారా ఆదాయం…
వికారాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 221 లీజుల ద్వారా ప్రభుత్వానికి రాయల్టీ, సీనరేజ్ల రూపంలో ఆదాయం చేకూరుతుంది. జిల్లాలో 4 పెద్ద తరహా ఖనిజముల గనులు, 217 చిన్న తరహా ఖనిజాల గనులు లీజులు మంజూరు చేశారు. జిల్లా పరిధిలో సున్నపురాయి లీజులు 4, ఎర్రమట్టి 71, మృత్తికలు ఒకటి, షెల్ ఒకటి, సున్నపురాయి పలకలు 52, బంకమట్టి 49, కంకర రాయి 34, గ్రానైట్ 6, పలుగురాయి 3 లీజులు ఉన్నాయి. ఒక్కో భూగర్భ వనరుకు సంబంధించి ప్రభుత్వం విధించిన రాయల్టీ, సీనరేజ్ చార్జీలు ఒక రకంగా ఉంటాయి. ఇందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రాయల్టీ, సీనరేజ్ చార్జీలు వసూలు చేయబడుతాయి.
ఈసారి రూ.83.63కోట్ల ఆదాయం..
వికారాబాద్ జిల్లా పరిధిలోని మైనింగ్‌లు, క్వారీల ద్వారా ప్రభుత్వానికి ఈసారి రూ.83.63 కోట్లు ఆదాయం చేకూరింది. 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2022 మార్చి 31వ తేదీ వరకు జిల్లాలో సున్నపురాయి ద్వారా రూ.41.12కోట్లు, ఎర్రమట్టి ద్వారా రూ.34.08కోట్లు, పలుగురాయి ద్వారా రూ.1.43కోట్లు, సుద్ద ద్వారా రూ.2.09కోట్లు, తాండూరు బండ ద్వారా రూ.2.01కోట్లు, షేల్ ద్వారా రూ.33.24లక్షలు, కంకర రాయి ద్వారా రూ.74,89లక్షలు, గ్రానైట్ ద్వారా రూ.10.83లక్షలు, ఇతర ఆదాయం రూ.1.68కోట్లు ఈసారి ప్రభుత్వానికి ఆదాయంగా చేకూరింది. ఇదిలావుండగా గత ఐదేండ్లుగా గనుల ద్వారా సర్కారుకు ఆదాయం పెరుగుతూ పోతున్నది. 2016-17లో రూ.57.43 కోట్లు లక్ష్యం కాగా, రూ.63.75 కోట్లు, 2017-18లో రూ.83.78 కోట్లు లక్ష్యం నిర్దేశించగా.. రూ.74.75 కోట్లు, 2018-19లో రూ.94.95 కోట్లు వసూలు లక్ష్యం కాగా.. రూ.83.75 కోట్లు, 2019-20లో రూ.73.49 కోట్లు వసూలు లక్ష్యం ఉండగా రూ.87.63 కోట్లు, 2020-21లో రూ.75.06 కోట్లు ఆదాయం చేకూరింది. ఇదిలావుండగా సీనరేజ్ చార్జీలను ప్రభుత్వం పెంచడం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గనుల శాఖ ద్వారా ఆదాయం మరింత పెరగడానికి అవకాశం ఉన్నది.
వరుసగా ప్రతి సంవత్సరం వలె ఈసారి కూడా ఆదాయం అధికంగా వస్తుందని గనుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం సీనరేజ్ చార్జీల పెంపు సైతం కానుందని చెబుతున్నారు. దీంతోపాటు ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టుకు సైతం పెద్దఎత్తున నిధులు వచ్చాయి. గనుల లీజుల ద్వారా వసూలయ్యే ఆదాయంలో ఒక శాతం డీఎంఎఫ్‌టీకి జమ చేయబడుతాయి. ఈ నిధులను సైతం సంబంధిత గనుల ద్వారా ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు అధికంగా ఖర్చు చేయడం జరుగుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో డీఎంఎఫ్‌టీకి రూ.23.80 కోట్లు వచ్చాయి. అత్యధిక ప్రభాతి ప్రాంతాల్లో అధిక మొత్తంలో ఈ నిధులు వెచ్చించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం నిధుల కేటాయింపు జరుగుతుంది. జిల్లా స్థాయిలోని డీఎంఎఫ్టీ కమిటీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తుంది.
ఈసారి పెరిగిన ఆదాయం
2021-22 ఆర్థిక సంవత్సరంలో గనుల శాఖ ద్వారా వికారాబాద్ జిల్లా పరిధిలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఈసారి రూ.83.63 కోట్లు ఆదాయం చేకూరింది. డీఎంఎఫ్‌టీకి సైతం రూ.23.80 కోట్లు సమకూరాయి. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆదాయం పెరుగుతుంది. ఈసారి సీనరేజ్ చార్జీల పెంపుతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం మరింత పెరిగేందుకు అవకాశం ఉన్నది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ పెంపు అమలులోకి రావడం ద్వారా ఆదాయం పెరగనున్నది. – వి.వి.సాంబశివరావు,
ఏడీ, మైనింగ్, వికారాబాద్ జిల్లా