పరిగి, ఏప్రిల్ 17: సీఎం కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 80వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తుండగా… పేద ఉద్యోగార్థుల సౌకర్యార్థం జిల్లా గ్రం థాలయ సంస్థ వికారాబాద్ జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో అవసరమైన పుస్తకాలను తెప్పించి వారికి అందుబాటులో ఉంచింది. సాధారణంగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేస్తే ఉద్యోగార్థులు తమ ఆర్థిక స్థోమత ఆధారంగా కోచింగ్ తీసుకుంటుంటారు. పేదవారు తమకు అందుబాటులో ఉన్న పుస్తకాలను చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు శ్రమిస్తుంటారు. కాగా త్వరలోనే భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ఉద్యోగార్థులతో హౌస్‌ఫుల్‌గా మారాయి. కాగా డబ్బులు పెట్టి పుస్తకాలను కొనుగోలు చేసే పరిస్థితి లేని పేద వారికి గ్రంథాలయాలు కల్పతరువులుగా మారాయి. గతంలో ఎంతోమందికి అవి విజ్ఞానాన్ని అందించాయి. జిల్లా పరిధిలో మొత్తం 18 గ్రంథాలయాలు ఉన్నాయి. వాటిలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌తోపాటు పాఠకులు కోరిన పుస్తకాలను కూడా తెప్పించి అందుబాటులో ఉంచిం ది. ఆన్ డిమాండ్ బుక్స్ కార్యక్రమాన్ని ఇటీవల వికారాబాద్‌లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే.
ప్రతిరోజూ 600 పైగా ఉద్యోగార్థులు
జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌తోపాటు పాఠకులు కోరిన పుస్తకాలను కూడా తెప్పించి ఉద్యోగార్థులకు అందుబాటులో ఉంచడంతో వాటిని చదివేందుకు ప్రతిరోజూ సుమారు 600పైగా నిరుద్యోగ యువతీయువకులు గ్రంథాలయాలకు వస్తున్నారు. వికారాబాద్‌లోని జిల్లా గ్రంథాలయానికి ప్రతిరోజూ సుమారు 200 పైచిలుకు, పరిగిలో 100 మందికి పైగా, మిగతా గ్రంథాలయాల్లో మరో 300మందికి పైగా ఉద్యోగార్థులు వస్తున్నారు. వారు శ్రద్ధగా చదువుకునేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారు. కుర్చీలతోపాటు ఇతర మౌలిక వసతులను ఏర్పా టు చేశారు. వికారాబాద్‌లోని జిల్లా గ్రంథాల యం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుతుండగా.. జిల్లాలోని మిగతా గ్రం థాలయాలు ఉదయం 10.30 నుంచి సాయం త్రం 5 గంటల వరకు ఓపెన్‌గా ఉండటంతో ఉద్యోగార్థులు వచ్చి పోటీ పరీక్షల పుస్తకాలను చదువుకుంటున్నారు. వికారాబాద్ గ్రంథాలయంలోని ఓ హాల్లో సెలవు రోజుల్లోనూ నిరుద్యోగ యువతీయువకులు తమ సొంత పుస్తకాలను తెచ్చుకుని చదువుకునేందుకు అనుమతించారు. వీటి ద్వారా జిల్లాలోని సుమారు ఐదు వందల మందికిపైగా ప్రయోజనం చేకూరనున్నది.
అందుబాటులో 1,144 పుస్తకాలు
విజ్ఞాన నిలయాలుగా పేరొందిన గ్రంథాలయా లు ఉద్యోగార్థులకు చక్కని వేదికలుగా ఉపయోగపడుతున్నాయి. జిల్లా పరిధిలోని 18 గ్రంథాలయాల్లో పైసా ఖర్చులేకుండా పోటీ పరీక్షల మెటీరియల్‌తోపాటు ఇతర పుస్తకాలు, దినపత్రికలు, పాఠకులు కోరిన పుస్తకాలనూ ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు. ఆన్ డిమాం డ్ బుక్స్‌ను కూడా తెప్పించారు. ప్రతి గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన రిజిస్టర్లో పాఠకులు తమకు కావాల్సిన పుస్తకాలను రాసిన వెంటనే తెప్పించి అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు రూ.2,22,022 వెచ్చించి 1,144 ప్రత్యేక పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను కొనుగోలు చేశారు. వాటిలో అత్యధికంగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయంతోపాటు పరి గి, పెద్దేముల్, బషీరాబాద్, బంట్వారం గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచారు. అదేవిధంగా జిల్లాలోని మిగతా గ్రంథాలయాల్లో ఒక్కొక్క దానిలో 12 నుంచి 20 ప్రత్యేక పుస్తకాలను ఉంచారు. ఆయా ప్రాంతాల్లోని పాఠకులు, ఉద్యోగార్థుల సంఖ్య ఆధారంగా ఈ పుస్తకాలను సంబంధిత గ్రంథాలయాలకు పంపి స్తున్నారు. అవసరమైతే మరిన్ని పుస్తకాలను కూడా తెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా తెలుగు అకాడమీ వారు పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా ముద్రించనున్న 15 పుస్తకాలను ఈ నెలాఖరులోపు ప్రతి గ్రంథాలయానికి ఒక సెట్ తెప్పించి ఉద్యోగార్థులకు అందుబాటులో ఉంచనున్నారు. వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో రెండు సెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పోటీ పరీక్షల్లో అత్యధికంగా తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి ప్రశ్నలు వస్తుండటంతో ఈ పుస్తకాలను చదివితే ఉద్యోగార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారు.
ఉద్యోగార్థులకు వేదికలుగా..
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారికి అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలను గ్రంథాలయాల్లో అందుబాటులో హర్షణీయం. విజ్ఞా న నిలయాలుగా పేరొందిన గ్రంథాలయాలు ఉద్యోగార్థులకు చక్కని వేదికలుగా ఉపయోగపడుతున్నాయి. ప్రశాంత ఆహ్లాదకర వాతావరణంలో పైసా ఖర్చులేకుండా పోటీ పరీక్షల మెటీరియల్‌తో పాటు ఇతర పుస్తకాలు, దినపత్రికలు ఉచితంగా అందుబాటులో ఉంటున్నాయి.
-నరేశ్, అల్లీపూర్ , రీడర్
నిరుద్యోగులకు ఎంతో మేలు ..
వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచడం సంతోషకరం. ఈ పుస్తకాలు నిరుద్యోగ యువతీయువకులకు ఎంతో ఉపకరిస్తాయి. ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేయడం అభినందనీయం. -శంకర్, సంగారెడ్డి
ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని వారికి ..
గ్రంథాలయాల్లో ప్రభుత్వం అవసరమైన పుస్తకాలు, మెటీరియల్‌ను అందుబాటులో ఉండటం ద్వారా గ్రామీణ ప్రాం తాల నిరుద్యోగ యువతీయువకులకు ఎంతగానో దోహదపడుతుంది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని వారికి ఉపకరిస్తుంది.
-అమర్నాథ్, బొంరాస్‌పేట, కొడంగల్
కిటకిటలాడుతున్న గ్రంథాలయాలు
సీఎం కేసీఆర్ 80 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ వేదికగా ప్రకటించడంతో నిరుద్యోగ యువతీయువకులు కోచింగ్ సెంటర్లు, గ్రంథాలయాల వైపు పరుగులు తీస్తున్నారు. నగర శివారుతోపాటు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అధిక సంఖ్యలో కోచింగ్ సెంటర్లు వెలిశాయి. నిరుద్యోగ అభ్యర్థులతో అవి కిటకిటలాడుతున్నాయి. కాగా కోచింగ్ సెంటర్లకు వెళ్ల్లలేని వారు, ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేని పలువురు ఉద్యోగార్థులు ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని రోజంతా గ్రంథాలయాల్లోనే గడుపుతున్నారు. దీంతో ఇబ్రహీంపట్నంలోని లైబ్ర రీ ప్రతిరోజూ నిరుద్యోగ అభ్యర్థులతో నిండిపోతున్నది. మరోవైపు ఇబ్రహీంపట్నంలో ఎమ్మె ల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత పోలీస్, గ్రూప్స్‌నకు సంబంధించిన కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అలాగే రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం ఇబ్రహీంపట్నం సమీపంలోని శ్రీఇందు ఇంజినీరింగ్ కళాశాలలో పోలీస్ అభ్యర్థుల కోసం ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు.
లైబ్రరీలోనే సన్నద్ధమవుతున్నా ..
ప్రభుత్వం ఇబ్రహీంపట్నంలోని గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచింది. దీంతో ప్రతిరోజూ గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలను చదువుకోవడంతోపాటు అవసరమైన మెటీరియల్‌ను ఇంటికి తీసుకెళ్లి చదువుకొని మరునాడు లైబ్రరీలో అందజేస్తున్నా.
-కత్తుల శ్వేత, తుర్కగూడ, ఇబ్రహీంపట్నం
నిరుద్యోగులకు అండగా ప్రభుత్వం
నిరుద్యోగుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం గ్రంథాలయాల్లో అన్ని రకాల స్టడీ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచడం అభినందనీయం. నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని
ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి.
-బకున మల్లప్ప, ఇబ్రహీంపట్నం
అందుబాటులో అన్ని రకాల పుస్తకాలు
నిరుద్యోగ యువతీయువకుల కోసం అన్ని రకాల స్టడీమెటీరియల్‌ను అందుబాటులో ఉంచాం. దూర ప్రాంతాలకెళ్లి ఇబ్బందులకు గురికాకుండా ఉద్యోగార్థులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని లైబ్ర రీని సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి.
-యాదయ్య, గ్రంథపాలకుడు ఇబ్రహీంపట్నం లైబ్రరీ