పరిగి/ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 3 : యాసంగి సీజన్లో రైతులు పండించిన వడ్లు కొనేంతవరకు కేంద్రంతో కొట్లాటకు టీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. యాసంగి వడ్లు కొనుగోలు చేయాల్సిందిగా మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలువగా కొనుగోలు చేయబోమని కరాఖండిగా చెప్పడంతోపాటు మీ ప్రజలతో నూకలు తినిపించండంటూ వెకిలి మాటలు మాట్లాడడం, ఇటీవల పార్లమెంటులో సైతం అవహేళనగా మాట్లాడడంతో కేంద్ర ప్రభుత్వంపై రైతాంగం అగ్గిమీద గుగ్గిలమవుతున్నది. తెలంగాణ రైతుల ఆత్మగౌరవ బావుటా ఎగురవేసేందుకు, వారు పండించిన యాసంగి వడ్లు కొనుగోలు చేసేదాక పోరాడేందుకు ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ పోరుబాటను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
కేంద్రం బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమని చెప్పడంతో యాసంగి సీజన్ ప్రారంభంలో రైతులు వరి వేయరాదని, రైస్‌మిల్లులతో ఒప్పందం చేసుకున్నవాళ్లు వేసుకుంటే అభ్యంతరం లేదని స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం కొనుగోలు చేయనందున యాసంగి వడ్ల కొనుగోలుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయబోమని స్పష్టం చేశారు. ఆ సమయంలో రైతులను రెచ్చగొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీరు వరి వేయండి, కేంద్రంతో మాట్లాడి మేము కొనుగోలు చేయిస్తామంటూ ప్రగల్బాలు పలికారు. సీఎం కేసీఆర్ సూచనతో వరి సాగు విస్తీర్ణం తగ్గినా, బీజేపీ నేతల ఉచిత హామీతో వరి వేసిన రైతులు నేడు నిండా మునిగే పరిస్థితి ఏర్పడింది. యాసంగి సీజన్ వడ్లు రైస్‌మిల్లుకు వేస్తే బియ్యం విరిగిపోయే ప్రమాదం ఉండడంతో బయటి మార్కెట్లో విక్రయించినా ధర తక్కువగా వస్తున్నది.రైతులను ముంచాలని కుట్ర యత్నాలకు పాల్పడిన బీజేపీ రాష్ట్ర నాయకులు, వడ్లు కొనుగోలు చేయబోమంటూ అవహేళన చేసిన కేంద్ర బీజేపీ పెద్దల దిమ్మ తిరిగేలా, బీజేపీ నేతల బండారాన్ని ఎక్కడికక్కడ కడిగి పారేయడానికి, వడ్లు కొనుగోలు చేయించేందుకు టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలకు నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి పార్టీ జిల్లాల అధ్యక్షులు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలతోపాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ ఆయా మండలాల అధ్యక్ష కార్యదర్శులతో మాట్లాడారు. ప్రతి గ్రామం నుంచి కేంద్రంపై పోరు చేసేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.
నేటి నుంచి నిరసన దీక్షలు
యాసంగిలో రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సోమవారం అన్ని మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి నిరసన దీక్షలు, ధర్నాలు చేపడుతారు. 6న జాతీయ రహదారుల దిగ్బంధం, రాస్తారోకో చేస్తారు. 7న జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపడుతారు. 8న ప్రతి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనంతోపాటు ప్రతి రైతు ఇంటిపై నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం ఉంటుంది. 11న ఢిల్లీలో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష చేపడతారు. నిరసన దీక్షలో టీఆర్ఎస్కు చెందిన ప్రజా ప్రతినిధులందరూ పాల్గొంటారు.
ఈ నెల 6న బీజాపూర్ రహదారిపై చేవెళ్ల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, విజయవాడ రహదారిపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో, బెంగళూరు రహదారిపై షాద్‌నగర్ ఎమ్మెల్యే, శ్రీశైలం రహదారిపై మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించాలని ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాల్లోని మండలాలు, గ్రామాల నుంచి పెద్దఎత్తున టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను భాగస్వాములను చేయాలని పార్టీ భావిస్తోంది.
ప్రతి ఇంటిపై నల్లజెండాలు ఎగురవేసే కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రతి రైతు ఇంటిపై నల్లజెండాలు ఎగురవేసే బాధ్యతను గ్రామ శాఖలకు కేటాయించారు. మండలశాఖ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
ధర్నా విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
రైతులు కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ ప్రభుత్వ వైఖరిపై సోమవారం తాండూరు నియోజకవర్గంలో నిరసన, ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాం. తాండూరు, యాలాల, బషీరాబాద్ పెద్దేముల్ మండల కేంద్రాల్లో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని అధిష్ఠానం సూచించినట్లు కేంద్రంపై నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలి.
కేంద్రానికి పతనం తప్పదు
తెలంగాణ రైతులపట్ల చిన్నచూపు చూసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పతనం తప్పదు. రాష్ట్రంలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయడంలో కేంద్రం అనేక అడ్డంకులను సృష్టిస్తున్నది. పంజాబ్ రాష్ట్రంలో వడ్లను కొనుగోలు చేసిన ప్రభుత్వం తెలంగాణాలో మాత్రం కొనుగోలు చేయబోమని చెప్పడం బాధాకరం. కేంద్రం ఇప్పటికైనా కండ్లు తెరిచి కొనుగోలు చేయాలి. లేకపోతే కొనేవరకు ఉద్యమం తప్పదు.
– వంగేటి లక్ష్మారెడ్డి, రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు