పరిగి/తాండూరు/వికారాబాద్/కొడంగల్, ఏప్రిల్ 2: తెలుగు సంవత్సరాది ఉగాదికి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. శనివారం ఉగాది పర్వదినం సందర్భంగా ఇంటింటా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సమయంలో అన్ని గ్రామాల్లోని ఆలయాల్లో వేద పండి తులు పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఏ రాశుల వారి జాతక ఫలం ఎలా ఉన్నది తెలియజేశారు. పరిగిలోని బహార్ పేట్ హనుమాన్ మందిర్‌లో జరిగిన పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, పుర ప్రముఖులు పాల్గొన్నారు. తాండూరు నియోజకవర్గంలో రైతులు తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా పొలాల్లో పూజలు చేసి దుక్కులు దున్నడాన్ని ప్రారంభించారు. తాండూరు శ్రీభావిగి భద్రేశ్వరదేవాలయం, కాళికాదేవి, పాత తాం డూరులోని కోటేశ్వర దేవాలయం, రేణుకా ఎల్లమ్మ, కట్టమైసమ్మ , భవానీమాత దేవాలయం, కోకట్ రోడ్డు మార్గంలోని సాయిబాబా దేవాలయంతో పాటు నియోజకవర్గంలో తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల పరిధిలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
ఆలయాల్ల్లో వేద పండితులు పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రజలకు షడ్రుచుల ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఉగాది సందర్భంగా ప్రజలకు ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి రోజూ ఉచితంగా మంచినీళ్లు, అంబలిని అందజేసేందుకు జిల్లా వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు రొంపల్లి సంతోష్‌కుమార్ తాండూరులో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట వీరశైవ యువదళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చడిని చైర్పర్సన్ ముద్ద దీప పట్టణ ప్రజలకు అందజేశారు. వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ వేంకటేశ్వర ఆలయంలో పూజలు చేసి, నూతన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్ మండలాల్లోని పలు దేవాలయాల్లో అర్చకులు పంచాంగ శ్రవణం నిర్వహించారు.
స్థానిక మహాలక్ష్మి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో కొనసాగుతున్న 42వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాడి పంటలు, వర్షాలు, ధరల పెరుగుదల తదితర అంశాలతోపాటు 12 రాశుల ప్రభావం, ఫలితాలను వివరించారు. అనంతరం భక్తులు తమతమ రాశుల ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పలు గ్రామాల్లో ఉగాది షడ్రుచుల ఉగాది పచ్చడిని పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.