పరిగి, మార్చి 31: తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్‌లోని బాలక్ గ్రౌండ్లో జరిగిన కార్యక్రమంలో దళితబంధు లబ్ధిదారులు 92 మందికి వాహనాలు, పౌల్ట్రీ, పాడి పరిశ్రమ, గొర్రెలు, మేకల పెంపకానికి అవసరమయ్యే షెడ్ల నిర్మాణానికి డబ్బులకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను మంత్రి సబితాఇంద్రారెడ్డి అందజేసి మాట్లాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారన్నారు. కేవలం ఒక ఉప ఎన్నిక కోసమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని విమర్శించిన ప్రతిపక్ష పార్టీల నాయకుల నోటికి ఈ రోజు తాళం పడిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని, ప్రతి కుటుంబానికీ ఈ పథకం కింద లబ్ధి చేకూరనుందన్నారు.
2021-22 లో రూ.4వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని 40 వేల కుటుంబాలకు దళితబంధు కింద లబ్ధి చేకూర్చడం జరిగిందని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.17,700 కోట్లు ఖర్చు చేసి 2లక్షల కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సాయం అందనున్నదన్నారు. ప్రతి దళిత కుటుంబానికీ రూ.10లక్షలు ఇవ్వడం ద్వారా సీఎం కేసీఆర్ వారి గుం డెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా వారిని ఆపద సమయంలో ఆదుకునేందుకు దళిత రక్షణ నిధిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీల కోసం నిధులు ఖర్చు చేసేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తీసుకురాగా, ఒక ఏడాదిలో సబ్‌ప్లాన్ కింద కేటాయించిన నిధులను ఖర్చు చేయకుంటే ఆ నిధులను మరుసటి ఏడాది నిధులతో కలిపి ఖర్చు చేసేలా సీఎం కేసీఆర్ చట్టం తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. తెలంగాణ సాధించిన తర్వాత ఏం చేస్తారని హేళన చేసిన వారికి నేడు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధే నిదర్శనమని మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు.
అందరికీ బంధువు సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని మంత్రి సబితారెడ్డి కొనియాడారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం కేసీఆర్ అందరికీ బంధువు అయ్యారని, దేశానికి కూడా ఆత్మబంధువు కావాలని కోరుకుందామని అన్నారు. దళితబంధు ద్వారా పేద దళితులు ఆర్థికంగా లబ్ధి పొందడంతోపాటు నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగాలని ఆమె కోరారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారని, గత ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ మార్చి 31 వరకు వికారాబాద్ జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు రూ.421 కోట్ల రుణాలను తీసుకున్న ట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు అండగా ఉండి మరెన్నో సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు జరిగేలా చూడాలన్నారు. అనంతరం వికారాబాద్ జిల్లా చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పేదల సంక్షేమం కోసం సుమారు 300 పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందుతున్నదని, దీంతో మహిళలకు నీటి ఇబ్బందులు తొలగిపోయినట్లు చెప్పారు.
పేద దళితులు దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ప్రగతి సాధించడంతోపాటు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు కింద రూ.50వేల కోట్లు, కల్యాణలక్ష్మి పథకం కింద రూ.40 వేల కోట్లు అందించిన ఘన త సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు మరువలేనివని ప్ర శంసించారు. అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదలు, రైతుల పక్షపాతి అని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న అనేక పథకాలను ఇతర రాష్ర్టాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నా రు. దళితులను లక్షాధికారులను చేసేందుకే సీఎం కేసీఆర్ దళితబంధును అమలు చేస్తున్నారన్నారు.
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ రూ.10 లక్షలను వంద శాతం సబ్సిడీగా అందజేసే ఏకైక పథకం దళితబంధు అని పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని కుటుంబాలకు ప్రభు త్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. తాం డూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ దళితబంధు లబ్ధిదారుల కండ్లల్లో ఆనందం కనిపిస్తున్నదని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ప్రశంసించారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్‌పటేల్ మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని…ప్రజలు సీఎం కేసీఆర్‌కు అండగా ఉండాలన్నారు. వికారాబాద్ కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ జిల్లాలో 358 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, వారు 441 యూనిట్లను ఎంచుకున్నట్లు తెలిపారు. పౌల్ట్రీ, పాడి పశువులు, గొర్రెలు, మేకల పెంపకానికి సంబంధించి షెడ్ల నిర్మాణానికి ఒక్కొక్కరికి రూ.1.50 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు.
ఐదుగురు లబ్ధిదారుల కోసం ఒక అధికారిని నియమించినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ధారూర్ మండలం కెరెల్లి గ్రామంలో దళితబంధు కింద పౌల్ట్రీఫామ్ నిర్మాణానికి మంత్రి సబితారెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణాగౌడ్, జిల్లా పరిషత్ సీఈవో జానకీరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజెస్, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మం జుల, ఎంపీపీలు, జడ్పీటీసీలు, దళితబంధు లబ్ధ్దిదారులు పాల్గొన్నారు.
ట్రాలీఆటో తెచ్చుకున్నా
సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దళితుల జీవితాల్లో వెలుగులు వస్తున్నాయి. నేను గతంలో పాత ఆటోలను నడిపి జీవించేవాడిని. దళితబంధు కింద సీఎం కేసీఆర్ కేటాయించిన నిధులతో ట్రాలీఆటో తెచ్చుకున్నా. దీనితో నా కుటుంబం గడిచేందుకు మార్గం చూపిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
-బాసుపల్లి ప్రభు, బొపునారం, బంట్వారం మండలం
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు. మా కుటుంబంలోని అందరం కూలీ పనులు చేసి జీవిస్తున్నాం. దళితబంధు పథకానికి మా కుటుంబాన్ని ఎంపిక చేయడంతోపాటు రూ.పది లక్షలను అందించడం సంతోషక రం. ఆ నిధులతో ట్రాక్టర్‌ను కొనుగోలు చేశా. ఇంతమంచి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్న సీఎంకు రుణపడి ఉంటాం.
-వెంకటయ్య, గట్టేపల్లి, ధారూర్ మండలం