పరిగి, నవంబర్ 14 : పంటల మార్పిడి ద్వారానే అధిక దిగుబడి సాధించవచ్చన్నది వ్యవసాయ శాస్త్రవేత్తల అభిప్రాయం. ప్రతిసారి వరి పంటను సాగు చేయడం ద్వారా అధికంగా నీటి వినియోగంతోపాటు రసాయనిక ఎరువులు విరివిగా వాడడంతో భూమిపై దుష్ప్రభావం చూపిస్తుందని పేర్కొంటున్నారు. వాస్తవంగా సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు సమపాళ్లలో వాడితే పెద్దగా ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలో వానకాలంలో 5.88లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, వరి సాగు 1.12లక్షల ఎకరాల్లో చేపట్టారు. గత యాసంగిలో సుమారు 98వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా, 70వేల ఎకరాల వరకు వరి సాగు చేపట్టడం జరిగింది. ఈసారి ప్రభుత్వం వరికి బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాల్సిందిగా సూచిస్తుంది.
వరికి అధికంగా నీటి వినియోగం..
ఇతర పంటలతో పోలిస్తే వరి సాగుకు అధికంగా నీటి వినియోగం జరుగుతుంది. ఇతర ఆరుతడి పంటలకు తక్కువ మోతాదులో నీరు అవసరమవుతాయి. వరికి సంబంధించి ఒక్కో రైతు ఒకలా నీటిని పెడుతారు. కొందరు 4 సెంటీమీటర్లు, మరికొందరు 5 సెంటీమీటర్ల ఎత్తు వరకు నీటిని నింపుతారు. తద్వారా ఎప్పుడు వరి చేనుకు నీరు సమృద్ధిగా అందేలా చూస్తుంటారు. అలాగే వరిని మిగతా పంటలతో పోలిస్తే సుమారు 25 నుంచి 30శాతం వరకు అధికంగా నీరు అవసరమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ఒక ఎకరం వరి పంట సాగుకు 1100 మి.మీ. నుంచి 1200 మి.మీటర్ల నీరు అవసరమవుతున్నది. వర్షాకాలంలో పుష్కలంగా వర్షాలు కురియడంతో భూగర్భ జలమట్టం పెరిగినా నీటిని ఇష్టానుసారంగా వాడడం ద్వారా వృథా అవుతుంది.
రసాయనిక ఎరువులతో భూమిపై దుష్ప్రభావం
వ్యవసాయ అధికారుల సూచన మేరకు కాకుండా పూర్తిస్థాయిలో రసాయనిక ఎరువుల వాడకం ద్వారా భూమిపై దుష్ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. పశువుల ఎరువు, రసాయనిక ఎరువులు సమానంగా వాడడం ద్వారా అధిక దిగుబడితోపాటు వరి ధాన్యంలో రసాయనాల అవశేషాలు పెద్దగా ఉండవని చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది రైతులు రసాయనిక ఎరువులనే విరివిగా ఉపయోగిస్తున్నారు. డీఏపీ ఎకరాకు ఒక బస్తా వాడాల్సి ఉండగా, ఒకటిన్నర బస్తాలు, యూరియా రెండు బస్తాలకు బదులు మూడు బస్తాలు, పొటాషియం సైతం అధికంగా వాడుతున్నారు. తద్వారా ఈ రసాయనిక ఎరువులు కొంతవరకు పంట ఎదుగుదలకు దోహదం చేయగా, మిగతాది భూమిలోనే ఉండిపోతుంది. ఎప్పటికీ నీరు పెట్టడం ద్వారా ఈ రసాయనిక ఎరువులు భూమి లోపలికి సైతం వెళ్తున్నాయి. తద్వారా కొన్నేండ్ల తర్వాత చౌడు శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మోతాదుకు మించి రసాయనిక ఎరువుల వినియోగంతో భూమిలో ఉండే పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయని, భూమి మరింత బిరుసుగా మారుతుందని తెలిపారు. తద్వారా రాబోయే సంవత్సరాల్లో భూమి మరింత గట్టి పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రతిసారి వరి కాకుండా ఇతర పంటల సాగుతో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్పవచ్చు.
పంట మార్పిడితో లాభాలు..
యాసంగిలో వరిసాగు రైతులు ప్రతిఏటా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. యాసంగిలో చలితీవ్రత అధికంగా ఉండటం వలన వరికి అనేక రకాల వ్యాధులు సోకుతున్నాయి. ఈ వ్యాధులకు మితిమీరిన రసాయన, క్రిమిసంహారక మందులను వాడటం వలన ఆహార కాలుష్యంతో పాటు భూమి కాలుష్యం కూడా పెరుగుతుంది. దీంతో ఒక ఎకరం వరిసాగుకు చలికాలంలో 20నుంచి రూ.30వేల ఖర్చు రావటంతో పాటు దిగుబడి కూడా గణనీయంగా పడిపోతుందని వ్యవసాయశాఖ నిపుణులు అంచనాలు వేశారు. వేసవిలో వరిసాగుకు అగ్గితెగులు, దోమపోటు, పాముపొడతో పాటు తదితర తెగుళ్లు సోకుతుండటంతో వీటి నివారణకు మితిమీరిన క్రిమిసంహారక మందులు వాడకం తప్పటంలేదు. దీంతో ఆహార కాలుష్యం అధికం కావటంతో పాటు భూసారంపై కూడా దుష్ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితిలో యాసంగిలో వరిపంటలు వేయటం వలన రైతులకు ఖర్చు ఎక్కువగా అవటంతో పాటు దిగుబడి కూడా తగ్గే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వరికి బదులు ఆరుతడి పంటలు సాగుచేయటమే మేలని రైతులకు సూచిస్తున్నారు. ఆరుతడి పంటల వలన ఖర్చు తక్కువగా కావటమే కాకుండా ఆదాయం కూడా రెండింతలు పెరిగే అవకాశముంది. అలాగే, వరి ఎకరాకు అయ్యే నీటి వినియోగంతో రెండునుంచి మూడెకరాల ఆరుతడి పంటలకు సరిపోతుందని, అలాగే, ఆరుతడి పంటల సాగుకు తక్కువ పెట్టుబడి ఖర్చుచేసి రెండింతల లాభాలను గడించవచ్చునని ప్రభుత్వం రైతులకు సూచిస్తుంది. గత వర్షాకాలంలో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగటంతో వరిధాన్యం దిగుబడి కూడా ఎక్కువగా వచ్చింది. వర్షాకాలం పంటలకు చలికాలం పంటలకు ఎక్కువ తేడా ఉండటం వలన చలికాలంలో దిగుబడి కూడా తగ్గే అవకాశాలున్నాయి. అలాగే, అధిక దిగుబడి వచ్చిన వరిధాన్యం కొనుగోలు చేయడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండటం వలన ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని రైతుల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకువస్తున్నారు.
మూడు ఎకరాల ఆరుతడి పంటలు సాగుచేసుకోవచ్చు
ఒక ఎకరం వరిపంటకు అవసరమయ్యే నీరు రెండు నుంచి మూడెకరాల ఆరుతడి పంటలకు సరిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వరికి ఒక ఎకరానికి 20నుంచి 30వేల ఖర్చు వస్తుందని ఈ ఖర్చుతో ఆరుతడి పంటలు రెండున్నర ఎకరాలు సాగుచేసుకోవచ్చునని, దీనిపై రైతులు దృష్టి సారించాలని ప్రభుత్వం రైతుల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను తీసుకువస్తున్నది. చలికాలంలో వరిపంటపై పెద్ద ఎత్తున చీడపీడల ప్రభావం ఉంటుందని దీంతో దిగుబడి కూడా గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తల వాదన. చీడపీడల నివారణ కోసం క్రిమిసంహారక మందులు అధికంగా వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో చలికాలంలో వరివేయటం వలన ఖర్చుతో పాటు దిగుబడి కూడా తగ్గుతుంది. మరోవైపు నీటికాలుష్యం, ఆహారం కాలుష్యం, భూమికాలుష్యం ఏర్పడి ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశాలున్నాయి.
ఆరుతడి పంటలతో అధిక లాభాలు..
చలికాలంలో ఆరుతడి పంటల సాగు రైతులకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు బావిస్తున్నారు. ఆరుతడి పంటలు వేయటం వలన తక్కువ నీటి ఖర్చుతో పాటుఅతితక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించవచ్చు. ఆరుతడి పంటలైన మినుములు, పెసర్లు, వేరుశెనుగ, కందులు, ఆముదం వంటి పంటలకు తక్కువ ఖర్చుతో వరికి వచ్చే దిగుడికి మూడింతల అధిక ఆధాయం వస్తుందని వ్యవసాయ నిపుణులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆరుతడి పంటలు వేయటం వలన చీడపీడల సమస్యలు కూడా ఉండవని, అలాగే, వరిపంటకు ఎకరానికి అయ్యే ఖర్చుతో మూడెకరాల ఆరుతడిపంటలు సాగుచేసుకోవచ్చునని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరుతడి పంటల దిగుబడి తక్కువ కాలంలో రైతులకు చేరుతుందని, మినుములు, పెసర్లు కేవలం 75రోజుల నుంచి 90రోజుల్లోపు రైతు చేతికి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో మినుములకు క్వింటాల్‌కు రూ.6800ధర ఉంది. ప్రభుత్వమే మినుముల కొనుగోలు చేస్తుంది. అలాగే, ఆరుతడి పంటలకు కూలీల వినియోగం కూడాతక్కువగా ఉండటంవలన రైతు చేతికి దిగుబడి అధికంగా వస్తుంది.
సేంద్రియ ఎరువుల వాడకంతోనే ఆరుతడిపంటలు..
ఆరుతడిపంటలకు ఎలాంటి క్రిమిసంహారక మందులు, కృత్రిమ ఎరువులు అవసరం లేకుండానే సేంద్రియ ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు సాధింవచ్చును. ప్రకృతిలో సహజంగా తయారయ్యే కంపోస్టు, వర్మీకంపోస్టు, పశువులు, కోళ్ల పేడ ద్వారా తయారయ్యే సహజమైన ఎరువుల వాడి ఈ పంటలు సాగుచేసుకుని అధిక దిగుబుడులు సాధించేందుకు వీలుంటుందని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
వరికి క్రిమిసంహాకర మందుల వాడకంతో ఆహార కాలుష్యం..
యాసంగిలో వరిపంటను సాగుచేయడం వలన ఈ పంటకు చీడపీడలు అధికంగా సోకే వీలుంటుంది. వీటి నివారణకు క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తుంటారు. దీంతో భూమి, ఆహారం, నీరు పూర్తిగా కాలుష్యమై ప్రజలు అనారోగ్యాల బారీన పడే అవకాశముంది. అంతేకాకుండా భూసారమంతా తగ్గిపోయి, ఎక్కువకాలం పాటు పంటలు సాగుకు భూములు పనికిరాకుండా పోయే అవకాశమున్నందున రైతులు ఆరుతడి పంటలను సాగుచేసుకునేందుకు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు.
రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు వరిసాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలపైన దృష్టి సారించాలి. ఆరుతడి పంటలతో రైతులు అధిక దిగుబడులు వచ్చే అవకాశమున్నందున రైతులు వరిని మరిచి ఆరుతడి పంటలైన మినుములు, రాగులు, కంది, జొన్న, మొక్కజొన్న, పత్తి, ఆముదం, సజ్జలు, నూనెగింజలతో పాటు పలు రకాల పంటల సాగుపై దృష్టి సారించాలి.
రసాయనిక ఎరువుల అధిక వినియోగం చేటు
ప్రతి పంటకు సేంద్రియ ఎరువులు తప్పనిసరిగా వాడాలి. కేవలం రసాయనిక ఎరువులే మోతాదుకు మించి వాడడం వల్ల భూమిపై దుష్ప్రభావం చూపిస్తున్నది. ప్రధానంగా భూమిలో చౌడు శాతం పెరుగుతుంది. అలాగే భూమిలోని పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు సైతం చనిపోతాయి. రసాయనిక ఎరువుల అవశేషాలు నీటితోపాటు భూమిలో ఇంకిపోవడం ద్వారా నీటి కాలుష్యం సైతం జరుగుతుంది. ప్రతిసారి వరి పంట సాగుతో అధికంగా నీటి వినియోగం జరుగుతుంది. పంట మార్పిడి వల్ల అధిక దిగుబడులు సైతం సాధ్యం.