
తాండూరు, జూలై 3: రైతు వేదికలు అన్నదాతలకు వరంగా మారాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం తాండూరు నియోజకవర్గంలోని యాలాల మండలం అగ్గనూరు, బషీరాబాద్ మండలం కాశీంపూర్, పెద్దేముల్ మండలం మంబాపూర్, తాండూరు మండలం ఐనెల్లి, తాండూరు పట్టణం 30వ వార్డులో హరితహారంతో పాటు పట్టణ, పల్లె ప్రగతిలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నతో కలిసి ఆమె పాల్గొన్నారు. రైతు వేదికలను ప్రారంభించడంతోపాటు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని 566 గ్రామాలకు పల్లె ప్రగతిలో భాగంగా నెలకు రూ.7.91 కోట్లు, పట్టణ ప్రగతిలో భాగంగా రూ.1.60 కోట్ల నిధులు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 12,769 గ్రామాలకు ట్రాక్టర్లు, ఇతర పరికరాలు సమకూర్చినట్లు తెలిపారు. రైతు వేదికల్లో అవగాహన సమావేశాలు నిర్వహించడం వల్ల వ్యవసాయంలో మంచి మార్పు వస్తుందన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఆధునిక వ్యవసాయ విధానంపై అవగాహన పెంచాలని సూచించారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తున్నదన్నారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ పంట లాగోడికి రైతుబంధు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ప్రమాదవశాత్తు రైతు మృతి చెందితే ఆ కుటుంబం ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించారన్నారు.
అధికారులు సూచనల మేరకు రైతులు పంటలు సాగు చేయాలని కోరారు. ప్రతి గింజకూ మద్దతు ధర కల్పిస్తామన్నారు. అడవుల శాతాన్ని పెంచేందుకు ప్రజలు మొక్కలు నాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు, వర్షాలు సమృద్ధిగా కురిసేందుకు మొక్కల పెంపకం తప్పనిసరి అన్నారు. ఆకుపచ్చ తెలంగాణను స్థాపించేందుకు ప్రజలు, నేతలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజా సంఘాలతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు నడుం బిగించాలన్నారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ ప్రతివార్డులో హరితహారాన్ని పండుగలా నిర్వహించాలన్నారు. చెట్లతోనే మానవుల మనుగడ సాధ్యమని గ్రహించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పౌసుమి బసు, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.