గెరిగెట్పల్లి రైతు కొత్త ఆలోచన

వికారాబాద్, జూలై 1 : వ్యవసాయ రైతులు పొలాల్లో కలుపుతీత పనులు చేసేందుకు కూలీల కొరత, ట్రాక్టర్ ధరలు పెరుగడం, ఎద్దులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ రైతు సొంత ఆలోచనతో తన బైక్‌కు కలుపు తీసే పరికరాన్ని అమర్చి బైక్ సహాయంతో ఎకరాకు రూ.200 ఖర్చుతో కలుపుతీత పనులు సులువుగా చేస్తూ మిగత రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గెరిగెట్పల్లికి చెందిన రామకృష్ణకు మూడు ఎకరాల పొలం ఉంది. పొలంలో కంది, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేస్తున్నాడు. కలుపు తీసేందుకు ఎకరం పొలానికి ఎద్దులతో రోజుకు రూ.1200, ట్రాక్టర్‌తో చేస్తే పంట నష్టంతో పాటు వేల రూపాయలు ఖర్చు అవుతుంది. బాగా ఆలోచించి బైక్‌కు కలుపు తీసే పరికరాన్ని అమర్చి పొలం పనులు చేయడం ప్రారంభించాడు. రూ.200 పెట్రోల్‌తో ఎకరం పొలం కలుపుతీత పనులు చేయవచ్చు. మూడు ఎకరాలతోపాటు 18 ఎకరాలు కౌలుకు తీసుకొని పొలం పనులు చేస్తున్నానని రైతు రామకృష్ణ తెలిపాడు.