
పరిగి, జూన్ 29 : జూలై 1 నుంచి ప్రారంభమయ్యే పల్లె ప్రగతిలో పారిశుద్ధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా పంచాయతీ అధికారి రిజ్వానా సూచించారు. మంగళవారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రగతిపై జరిగిన సమావేశంలో పాల్గొన్న డీపీవో మాట్లాడుతూ.. ప్రతి గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. జూలై 1 నుంచి 10 వరకు జరిగే పల్లె ప్రగతిలో పారిశుద్ధ్య పనులు, తాగునీటి క్లోరినేషన్, మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీలు సరి చేయించడంపై శ్రద్ధ చూపించాలని పేర్కొన్నారు. నివాస గృహాలపై గల హై టెన్షన్ వైర్లను, తుప్పు పట్టిన స్తంభాలు, వేలాడే విద్యుత్ వైర్లు సరిచేయాలన్నారు. వీధి దీపాల కోసం 3వ వైర్ ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
దోమ, జూన్ 29 : పల్లె ప్రగతి పనుల్లో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ సరళకుమారి అన్నారు. దోమ స్త్రీ శక్తి భవనంలో ఎంపీపీ అనసూయ అధ్యక్షతన సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులతో పల్లె ప్రగతి కార్యక్రమ నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో జయరాం మాట్లాడుతూ.. శానిటేషన్, వాటర్ సప్లయ్, సీజనల్ వ్యాధులు, చెత్త సేకరణ, ఎవెన్యూ ప్లాంటేషన్ల వంటి ప్రధానాంశాలను గుర్తించాలన్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లు, ఓపెన్ బోర్‌వెల్స్ వంటి వాటిని గుర్తించి పూడ్చివేయాలని కార్యదర్శులకు సూచించారు.
ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటాలి
ధారూరు, జూన్ 29 : జూలై 1 నుంచి ప్రతి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేయాలని ధారూరు ప్రత్యేక అధికారి (డీఈవో) రేణుకాదేవి అన్నారు. మంగళవారం ధారూరు స్త్రీ శక్తి భవనంలోని సమావేశ మందిరంలో పల్లె ప్రగతి, హరితహారంపై సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటి స్వచ్ఛ గ్రామంగా తయారు చేసుకోవాలన్నారు.
కీలక అంశాలపై చర్చ
కోట్‌పల్లి, జూన్ 29 : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలస్థాయి అధికారుల సమీక్షా సమావేశాన్ని మండలంలోని రాంపూర్ రైతు వేదికలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఎంపీడీవో లక్ష్మీనారాయణ తెలిపారు. సమావేశంలో పలు కీలక అంశాలపై సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులతో చర్చించినట్లు చెప్పారు.
పచ్చదనం, పరిశుభ్రతే ఎజెండా
యాలాల, జూన్ 29: పచ్చదనం, పరిశుభ్రతే ఎజెండాగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఎంపీపీ బాలేశ్వరగుప్తా అన్నారు. యాలాలలో ఏర్పాటు చేసిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యపరిచి శ్రమదానంలో పాల్గొనేలా చేయాలన్నారు.
పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి
మర్పల్లి, జూన్ 29 : పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని ఎంపీపీ లలిత అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో పల్లె ప్రగతిపై సమావేశం నిర్వహించారు.
జూలై 1న ప్రత్యేక సమావేశాలు
కులకచర్ల, జూన్ 29 : కులకచర్ల ఎంపీడీవో కార్యాలయంలో పల్లె ప్రగతిపై సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులతో ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, ప్రత్యేక అధికారి వినయ్‌కుమార్ సమావేశం నిర్వహించారు. జూలై 1న అన్ని గ్రామపంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా పల్లె ప్రగతి ప్రణాళిక గురించి ఈవోఆర్డీ సుందర్ వివరించారు.
గుర్తించిన ప్రతి సమస్యను పరిష్కరించాలి
పెద్దేముల్, జూన్ 29 : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో వార్డుల వారీగా గుర్తించిన ప్రతి సమస్యను పరిష్కరించాలని మండల స్పెషల్ ఆఫీసర్ వాసిరెడ్డి వీరభద్రరావు అన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు, ప్రణాళికపై అవగాహన కల్పించారు.
పల్లె ప్రగతి పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
మోమిన్‌పేట, జూన్ 29 : పల్లె ప్రగతి పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీడీవో శైలజారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలకు మండల ప్రత్యేకాధికారి బాబు మోజెస్ సమక్షంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.