పరిగి, జూన్ 3 : బడీడు పిల్లలందరూ బడుల్లో ఉండాలన్నది సర్కారు సంకల్పం. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం వలె ఈసారి సైతం బడిబాట కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. 3వ తేదీ శుక్రవారం ప్రారంభమైన బడిబాట కార్యక్రమం ఈనెల 10వ తేదీ వరకు కొనసాగుతుంది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా బడిబాట కార్యక్రమానికి సంబంధించి విద్యా శాఖ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. జిల్లా పరిధిలో మొత్తం 742 ప్రాథమిక పాఠశాలలు, 113 ప్రాథమికోన్నత పాఠశాలలు, 172 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు పది వేల మంది విద్యార్థులను చేర్పించేందుకు బడిబాట ద్వారా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. ఈసారి సుమారు 14,040 మంది విద్యార్థులను ఆయా తరగతుల్లో చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించడంతోపాటు కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టారు. విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ అప్డేట్ సైతం చేపడుతున్నారు.
14,040 మంది పిల్లలను కలిసి నమోదు..
వికారాబాద్ జిల్లా 18 మండలాల పరిధిలోని గ్రామాల్లో ఈనెల 10వ తేదీ వరకు బడిబాటలో భాగంగా పిల్లల వయస్సు ఆధారంగా తరగతిలో చేర్పించే కార్యక్రమం కొనసాగనున్నది. జిల్లావ్యాప్తంగా 696 మంది పిల్లలు బడి బయట ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. వారిలో 6 నుంచి 14 ఏండ్లలోపు చిన్నారులు 314 మంది, 15 నుంచి 19 ఏండ్లలోపు వారు 382 మంది ఉన్నారు. వారి పూర్తి వివరాలను సర్వే సందర్భంగా సేకరించారు. తద్వారా వారిని ఒక్కొక్కరిని కలిసి వారి వయస్సు ఆధారంగా సంబంధిత తరగతుల్లో చేర్పించేందుకు కృషి చేయనున్నారు. జిల్లాలోని అంగన్వాడీల్లో ప్రీ ప్రైమరీ చదువుతున్న 1,575 మంది పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించేందుకు ఈ బడిబాటలో ప్రతిఒక్కరి తల్లిదండ్రులను కలిసి విన్నవించడంతోపాటు వారు బడుల్లో చేరేలా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 5వ తరగతి పూర్తయిన విద్యార్థులు 10,139 మంది ఉండడంతో వారందరినీ సమీపంలోని ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతిలో చేర్పించేందుకు ప్రతి విద్యార్థిని కలిసి మాట్లాడి నమోదు చేయిస్తారు. జిల్లాలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో కొన్నింటిలో 7వ తరగతి వరకు, మరికొన్నింటిలో 8వ తరగతి వరకు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో 7వ తరగతి వరకు ఉన్న పాఠశాలలో చదువుకున్న 1,351 మందిని సమీపంలోని ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో, 8వ తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో చదువుకున్న 279 మందిని సమీపంలోని ఉన్నత పాఠశాలలో 9వ తరగతిలో చేర్పించనున్నారు.
ఉదయం 7 నుంచి 11 గంటల వరకు…
బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయం 7 నుంచి 11 గంటల వరకు గ్రామాల్లోని పిల్లలు, వారి తల్లిదండ్రులను కలిసి పాఠశాలల్లో చేర్పించే కార్యక్రమం కొనసాగుతుంది. ఎస్ఎంసీ చైర్మన్, సభ్యులు, మండల విద్యాశాఖ అధికారి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు సైతం పాల్గొని పిల్లలు ప్రభుత్వ పాఠశాల్లోనే చేరేలా చూస్తారు. ఈసారి ప్రభుత్వం నూతన విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనను ప్రారంభించనున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఉపాధ్యాయులందరికీ శిక్షణ సైతం ఇచ్చారు. తద్వారా ఆంగ్ల మాధ్యమం కోసం ప్రైవేటు స్కూళ్లకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసే కంటే స్వగ్రామంలోని సర్కారు బడిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుల విద్యాబోధనతో మరింత ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దబడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరనున్నారు. ఇప్పటికే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు సైతం ప్రారంభం కావడంతో ఆయా గ్రామాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యుల సహకారం సైతం తీసుకొని పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించే కార్యక్రమం కొనసాగించడం జరుగుతుంది.
10 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్..
బడిబాటలో భాగంగా ఈనెల 10వ తేదీ వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలో 14,040 మంది పాఠశాలల్లో చేర్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఇంటింటికి తిరిగి పిల్లలను కలిసి వారిని పాఠశాలల్లో చేర్పిస్తాం. మొదటి రోజు శుక్రవారం జిల్లాలో 257 మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించాం. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తాం.
– రేణుకాదేవి, వికారాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి