తాండూరు, జూన్ 3: పల్లెలు, పట్టణాలు ఆదర్శంగా రూపుదిద్దు కోవాలనే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునితారెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని వార్డులతో పాటు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల పరిధిలోని గ్రామాల్లో ఐదో విడుత కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ పరిధిలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న, వైస్ చైర్పర్సన్ దీప, కౌన్సి లర్లతో పాటు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కాలనీల్లో మొక్కలను నాటారు. పెద్దేముల్ మండలం మంబాపూర్తో పాటు యాలాల మండలంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులు ప్రారంభించారు. పల్లె ప్రగతిలో భాగంగా పంచాయతీలో నిర్వహించిన సమా వేశంలో పాల్గొని సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతితో నిర్వహిస్తున్న పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలు పట్టణం, పల్లెలను ప్రగతి దారుల్లో పయనింప చేస్తున్నాయన్నారు. పచ్చదనం పరిఢ విల్లేలా హరితహారం చేపట్టాలని, స్వచ్ఛతకు పెద్ద పీట వేయాలని సూ చించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి పల్లెలో ప్రగతి పరుగులు తీసేలా అందరూ పనిచేయాలని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే సమగ్రాభివృద్ధి జరుగు తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేస్తామన్నారు. పట్టణ, పల్లె ప్రగతి ప్రత్యేక కార్యాచరణ అమలును విజయవంతం చేసే బాధ్యత ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలదేనని అందుకు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా భాగస్వాములై కాలనీలను చక్కగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. దీనికి ముఖ్యంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఉన్న అధికా రులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ కనబరచి ప్రజా సేవకులుగా బాధ్య తలు నిర్వహించాలన్నారు.
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణం, గ్రామాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే బృహత్తర ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం మున్సిపల్, పంచాయతీలకు కావాల్సిన నిధులు అందిస్తు న్నదన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత పెంచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విస్తృత భ్యాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా నిధులు వినియోగించి గ్రామాల అభివృద్ధికి కృషి చేయా లని పేర్కొన్నారు. ప్రత్యేక ప్రణాళికతో పల్లె, పట్టణ ముఖచిత్రంలో మార్పు వస్తుందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.