పరిగి, జూన్ 3: గ్రామాలు, పట్టణాలు సమగ్రంగా అభివృద్ధి చేయడంతోపాటు పచ్చదనం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగి డివిజన్ పరిధిలోని పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు మండలాల్లోని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాదయాత్ర నిర్వహించి సమస్యలు గుర్తించారు. పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ గ్రామానికి వెళ్లినా తాగునీరు, కరెంటు సమస్యలు ఉండేవని, తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఈ రెండు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించారన్నారు. బసిరెడ్డిపల్లికి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గ్రామం వరకు బీటీ రెన్యువల్స్ పనులు రెండు నెలల్లో పూర్తవుతాయని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
గ్రామంలో సీసీ రోడ్లకు రూ.10 లక్షలు ఇప్పటికే మంజూరు చేసి పనులు పూర్తవగా మరో రూ.10లక్షలు మంజూరు చేయిస్తానని, రేపటి నుంచే పనులు ప్రారంభించాల్సిందిగా సర్పంచ్‌కు సూచించారు. మురికి కాలువల నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు 15 మందికి ఇంటి నిర్మాణం కోసం ఒక్కొక్కరికి రూ.3లక్షలు ప్రభుత్వం ద్వారా ఇప్పిస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు. గ్రామం సర్వతోముఖాభివృద్దికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డుకు ఒక క్రీడా ప్రాంగణం కోసం స్థలం పరిశీలించాల్సిందిగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. పరిగి పట్టణంలోని 11వ వార్డులో జరిగిన పట్టణ ప్రగతిలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగిస్తూ క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి హ్యాబిటేషన్, మున్సిపాలిటీలలోని ప్రతి వార్డుకు ఒక క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
11వ వార్డు పరిధిలో గల గుంతను పూడ్చివేయించడంతోపాటు పార్కు ఏర్పాటు లేదా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ కె.అరవిందరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ.సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి అనిల్‌కుమార్, ఎంపీడీవొ శేషగిరిశర్మ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బసిరెడ్డిపల్లి సర్పంచ్ సూరప్ప, కౌన్సిలర్లు ఎదిరె కృష్ణ, వారాల రవీంద్ర, వెంకటేశ్, మునీర్, టీఆర్ఎస్ నాయకులు బి.రవికుమార్ పాల్గొన్నారు. పూడూరు మండలం కంకల్ గ్రామంలో పూడూరు ఎంపీపీ మల్లేశం, కులకచర్ల మండల కేంద్రంలో ప్రత్యేకాధికారి, జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి హన్మంత్‌రావు, దోమ మండలం మోత్కూర్‌లో వైస్ ఎంపీపీ మల్లేశం, పరిగి మండలం యాబాజీగూడలో ఎంపీవొ దయానంద్‌లు పర్యటించి సమస్యలు గుర్తించ డంతోపాటు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. డివిజన్ పరిధిలోని అన్ని గ్రామపంచాయతీలలో పల్లె ప్రగతి ప్రారంభించి గ్రామసభలు నిర్వహించి నాలుగు విడతలుగా చేపట్టిన అభివృద్ధిని వివరించారు.