వికారాబాద్ : బాలల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే విధంగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జూలై నెలలో నిర్వహించే ప్రత్యేక ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులతో సమావేశరమయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో అక్రమ రవాణాకు గురవుతున్న, తప్పిపోయిన పిల్లలను గుర్తించే దిశగా సంబంధిత శాఖల అధికారులు అందరూ భాగస్వాములై పనిచేయాలన్నారు. బాల కార్మికుల నిర్మూలనకు సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిని సారించి బాల కార్మికులులేని జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. బాలల పరిరక్షణ, సర్వతో ముఖాభివృద్ధికి అధికారులు తమ తోడ్పాటును అందించాలని కలెక్టర్ చెప్పారు.
తప్పిపోయిన పిల్లందరినీ గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించడమే కాకుండా ఉపాధి అవకాశాల నిమిత్తం వృత్తి కోర్సులలో శిక్షణకై సన్నద్ధులను చేయాలని కలెక్టర్ సూచించారు. మతిస్థిమితంలేని వారిని పునరావాస కేంద్రాలలో ఆశ్రయం కల్పించి మానసిక వైద్యుల ద్వారా పరీక్షలను నిర్వహించి వైద్య సేవలు అందించాలని ఆయన తెలిపారు. బాల బాలికలను పనుల్లో పెట్టుకోవడం చట్ట రిత్యా నేరమనే విషయాన్ని యాజమానులకు తెలిసే విధంగా అవగాహన కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎం. సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష చౌదరి, డిడబ్ల్యూవో కృష్ణవేణి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకటేశం, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ వాల్యా నాయక్, అడిషనల్ ఎస్పీ (డీటీసీ) మురళీధర్, డీసీపీవో శ్రీకాంత్, బాలల పరిరక్షణ, చైల్డ్ లైన్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతిధులు పాల్గొన్నారు.