
వికారాబాద్, జూన్ 27 : పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పల్లె ప్రగతిని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. దీంతో ఆయా గ్రామాల్లో వీధులను శుభ్రం చేయడం, మురుగు కాల్వల్లో చెత్త తొలగించడం, పాడు బడిన ఇండ్లను కూల్చడం, ప్రకృతి వనాలను పెంచడం వంటి తదితర అభివృద్ధి పనులు చేస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటడం, గుంతల్లో మట్టితో చదును చేస్తున్నారు. పల్లె ప్రగతి నిధులతో వికారాబాద్ మండలం అభివృద్ధిలో దూసుకుపోతుంది. గ్రామాల్లో పడకేసిన అభివృద్ధి పనులు ప్రస్తుతం పరుగులు పెడుతున్నాయి. పల్లెలు అభివృద్ధి చెందినప్పుడే పట్టణాలు, రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ప్రభుత్వం పల్లె ప్రగతి పనులను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నది. రెండేండ్లుగా గ్రామాల్లోని వీధులను శుభ్రం చేయడం, మురుగు కాల్వల్లో చెత్తను తొలిగించడం, ముళ్లపొదలను, పాడుబడిన ఇండ్లను కూల్చడం తదితర పనులు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ను ఏర్పాటు చేయడంతో గ్రామంలో ఉన్న చెత్తను సేకరించి డంపింగ్యార్డులకు తరలిస్తున్నారు.
గ్రామ జనాభాను భట్టి గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులను నియమించి వారికి ప్రతి నెలా గ్రామ పంచాయతీ నుంచి జీతాలను అందిస్తుంది. వికారాబాద్ మండలంలో 21 గ్రామాలు ఉన్నాయి. పల్లె ప్రగతి పనులు వేగవంగా చేసేందుకు జిల్లా కలెక్టర్ నుంచి మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం అభివృద్ధి పనుల్లో పర్యవేక్షించి అభివృద్ధికి మార్గనిర్దేశాలు చేశారు. సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకంగా మారింది. అందులో పులుమద్ది గ్రామంలో అభివృద్ధి పనులు అన్ని పూర్తయి ఆదర్శ గ్రామంగా పేరు పొందింది. సీసీ రోడ్లు, ప్రకృతి వనాలు, నర్సరీ, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డు చివరి దశకు చేరడంతో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. గ్రామాలకు మిషన్ భగీరథ నీరు ఇంటి గడపను తడుతున్నాయి. ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టి పల్లెల్లో ప్రకృతి వనం, డంపింగ్యార్డు, నర్సరీలతో ఆహ్లాదకరంగా తయారైంది. గత సంవత్సరం హరిత హారం కింద నాటిన మొక్కలు సజీవంగా ఉన్నాయి. అవెన్యూ ప్లాన్టేషన్ ద్వారా గ్రామానికి వచ్చే ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటుతున్నారు.
పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం
గ్రామంలో ప్రతి రోజు పారిశుద్ధ్య పనులు చేయడం జరుగుతుంది. ప్రల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో ప్రకృతివనాలు, క్రిమిటోరియం, మంచి నీటి కోసం మినీ ట్యాంకులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం మేరకు పూర్తి చేస్తున్నాం. అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాం.