Kodangal | కొడంగల్, జూన్ 17: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్రీడా పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కొడంగల్ ఎంఈవో రాంరెడ్డి తెలిపారు. నాలుగో తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థినీవిద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడా పోటీలు నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తామని చెప్పారు. 8 నుంచి 9 సంవత్సరాల వయసు విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని చెప్పారు.
స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 10.30 గంటలకు మండల స్థాయి స్పోర్ట్స్ సెలక్షన్స్ జరుగుతాయని ఎంఈవో రాంరెడ్డి తెలిపారు. ఈ క్రీడా ఎంపికలకు నాలుగో తరగతి విద్యార్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు కూడా పాల్గొనే విధంగా ఆయా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్లు, ప్రైవేటు పాఠశాల పీఈటీలు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థినీ విద్యార్థులు స్థానిక జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలోని పీడీ సుధాకర్‌ను ఫోన్ నెంబర్లో 9502494613 లేదా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పీడీ అజీజ్ ఫోన్ నెం 8978758124 ను సంప్రదించాలని సూచించారు.