తుర్కయాంజాల్ : పేద దళిత రైతుల నుంచి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని గుంజుకొని అరకొర పరిహారం చెల్లించిన తొరూర్ భూ సమస్యకు ఎమ్మెల్యే పరిష్కారం చూపారు. 15 ఏండ్ల ఈ భూ సమస్యకు సుదీర్ఘ పోరాటం తరువాత న్యాయం జరగటంతో తొరూర్ దళిత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తొరూర్ గ్రామం సర్వే నెంబర్ 383/1లో 97 మంది దళిత రైతుల నుంచి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకొని ఎకరాకు లక్షన్నర చొప్పున పరిహారం చెల్లించింది. దీనికి అంగీకరించని రైతులు అప్పటి నుంచి కబ్జాలోనే ఉంటూ సాగు చేసుకుంటున్నారు. తమకు న్యాయమైన పరిహారం అందేందుకు రైతులు కోర్టుకు సైతం వెళ్లగా కోర్టు అప్పట్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో రోడ్డున పడ్డ దళిత రైతులు 15 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు.
సమస్యను వివిధ సందర్భాల్లో ఎమ్మెల్యేకు వివరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులతో ఆర్డీవో వెంకటాచారి, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ వెంకటేశ్వర్లుతో కలిసి ఎమ్మెల్యే చర్చలు జరిపారు. తప్పకుండా వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటి ప్రభుత్వం మొక్కుబడిగా పరిహారమిచ్చి చేతులు దులుపుకుందని, మరోసారి ప్రభుత్వం పరిహారమివ్వడానికి నిబంధనలు అంగీకరించవని రైతులకు ఎమ్మెల్యే వివరించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తొరూర్ సర్వే నెంబర్ 383/1లోని ప్రభుత్వ భూమిలో త్వరలో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న లేఅవుట్లో భూములు కోల్పోయిన 97 మంది దళిత రైతు కుటుంబాలకు 300 చదరపు గజాల చొప్పున ఇంటి స్థలాలు కేటాయిస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు. ఎమ్మెల్యేకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లకా్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట రమణారెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నల్లబోలు ప్రభువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు మేకం అంజయ్య, తిప్పగల్ల బాబు, మల్లెల నర్సింహ, మాజీ ఎంపీటీసీలు అంజయ్య, యాదయ్య, రైతులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్
ఇబ్రహీంపట్నం : పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు.మున్సిపాలిటీకి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఆనంగల్ల బిక్షపతి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బిక్షపతి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినందున ఆయనకు టీఆర్ఎస్ పార్టీ నుంచి బీమా సౌకర్యం ద్వారా రూ. 2 లక్షల చెక్కును ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మృతుడి కుటుంబీకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ యాదగిరి, యాచారం జడ్పీటీసీ జంగమ్మ, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అంజిరెడ్డి పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
సీఎం సహాయనిధి నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంచాల మండల పరిధిలోని బండలేమూరు గ్రామానికి చెందిన పాతులోత్ లక్ష్మికి రూ. 4 లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలను ప్రవేశపెడుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సుకన్య శేఖర్‌రెడ్డి, కొంకని విజయ్‌కుమార్, జెర్పుల కిషన్ తదితరులు పాల్గొన్నారు.