పరిగి, ఏప్రిల్ 3 : ప్రభుత్వం 57 ఏండ్లు నిండిన అర్హులందరికీ ఆసరా వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే పింఛన్ అందజేసేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్నది. ఇందు కోసం దరఖాస్తు చేసుకునేందుకు రెండు పర్యాయాలు అవకాశం కల్పించడంతో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా విడుతల్లో కలిపి మొత్తం 22,201 దరఖాస్తులు అందాయి. జిల్లా పరిధిలో ప్రతినెల 94,474 మందికి ఆసరా కింద ప్రతి నెలా రూ.22.02కోట్లు పింఛన్ డబ్బులు అందజేయనున్నది. ఇందులో వృద్ధులు 30,213 మందికి పింఛన్ అందిస్తున్నారు. ఆసరా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం గత ఆగస్టులో అవకాశం కల్పించగా, జిల్లా వ్యాప్తంగా 21,256 దరఖాస్తులు అందాయి. మిగిలిపోయిన వారందరూ దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా రెండోసారి అక్టోబర్ 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అవకాశం కల్పించగా, మీ సేవ కేంద్రాల్లో జిల్లాలో కొత్తగా 945 మంది దరఖాస్తు చేసుకున్నారు. వికారాబాద్ జిల్లాలోని మండలాల్లో రెండు విడుతల్లో కలిపి 22,201 దరఖాస్తులు వృద్ధాప్య పింఛన్ల కోసం అందాయి.
వికారాబాద్ జిల్లాలో 22,201 దరఖాస్తులు
57 ఏండ్లు నిండిన అర్హులైన పేదవారు ఆసరా వృద్ధాప్య పింఛన్ కోసం సర్కారు దరాఖాస్తులు కోరగా రెండు పర్యాయాలు కలిపి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 22,201 దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలోని మర్పల్లి మండలంలో 1448, పరిగిలో 1543, ధారూర్‌లో 1225, బంట్వారం మండలంలో 462, కులకచర్లలో 1069, బొంరాస్‌పేట్‌లో 1,401, వికారాబాద్‌లో 1718, చౌడాపూర్‌లో 422, దోమలో 1289, దౌల్తాబాద్‌లో 1238, కొడంగల్‌లో 1288, కోట్‌పల్లిలో 503, మోమిన్‌పేట్‌లో 1218, నవాబుపేట్‌లో 936, పెద్దేముల్లో 1384, పూడూరులో 904, బషీరాబాద్‌లో 1042, తాండూరులో 2572, యాలాల్లో 1001 దరఖాస్తులు అందాయి.
పూర్తిస్థాయిలో పరిశీలన అనంతరం పింఛన్లు
పింఛన్ల దరఖాస్తులను పరిశీలించి, దరఖాస్తుదారులు అర్హులేనా అని నిర్ధారించిన తర్వాత పింఛన్ అందనున్నది. ప్రతి గ్రామం వారీగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించడంతోపాటు ఆయా గ్రామాల్లో ప్రత్యేకంగా నియమించిన అధికారులతో విచారణ జరిపి పింఛన్‌కు అర్హులా కాదా అని వారు నిర్ధారిస్తారు. ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం సంబంధిత అధికారులు అర్హులను ఎంపిక చేస్తారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు త్వరలోనే 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ అందించేందుకు సన్నాహాలు చేపట్టనున్నారు.