కలకాలం మధుర జ్ఞాపకాలు
ప్రకృతి అందాలను ఒడిసిపట్టి పదిలంగా నిలిపేది ఫొటోగ్రఫీ
సృజనాత్మకతకు ప్రతిబింబం
లక్షలాది మందికి ఉపాధి
నేడు ప్రపంచ ‘ఫొటోగ్రఫీ’ దినోత్సవం
ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 18 : సృష్టిలోని ప్రకృతి అందాలు, కొండాకోనలు, వాగువంకలు, గుట్టలు, రమణీయమైన ప్రకృతి అందాలన్నింటినీ తనలో ఒడిసి పట్టుకుని ఆ మధుర ఘట్టాలను పదికాలాల పాటు పదిలంగా నిలిపే అద్భుత ప్రక్రియ ఫొటోగ్రఫీ. మానవజీవితంలో విడదీయలేని బంధం ఫొటోగ్రఫీ. నేడు ప్రపంచమే ఫొటోగ్రఫీతో ముడిపడి ఉందనటంలో అతిశయోక్తిలేదు. శ్రమైక్య జీవన సౌందర్యాన్ని, సంతోషాన్ని, విషాదాన్ని తనలో ఒడిసి పట్టేది ఫొటోగ్రఫీ. చిత్రకళ, శిల్పకళ, వాస్తుకళ, నృత్యకళ, సంగీతంవంటి కళలాగే ఫొటోగ్రఫీ ఒకటి. సృజనాత్మకత దృశ్యకళ ఫొటోగ్రఫీ. వివిధ కళల మాదిరిగానే ఫొటోగ్రఫీకి కూడా ఒక చరిత్ర ఉంది. మారుతున్న కాలం, టెక్నాలజీతో పాటు నేడు డిజిటల్ ఫొటోగ్రఫీ నడుస్తున్నది. క్రీడాదినోత్సవం, మాతృభాషా దినోత్సవం, మదర్స్డేలాగానే ప్రతి ఏడాది ఆగస్టు 19న ప్రపంచ ఫ్రొటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఒక కళగా మొదలైన ఫొటోగ్రఫీ నేడు లక్షలాది మందికి జీవనోపాధిగా మారింది. పదికాలాల పాటు పదిలంగా మధుర ఘట్టాలను చెంత నిలుపు నేటి కాలం ఫొటోగ్రఫీ. గ్రీకు పారీస్ దేశాల్లో మొదలైన ఫొటోగ్రఫీ భారతదేశంలో తొలిసారిగా కలకత్తాలో ప్రారంభమై నేడు దేశం నలుమూలలకు విస్తరించింది.
ఫొటోగ్రఫీ అనగా..
ఫొటోగ్రఫీ అనే పదంలో ‘పోస్’ అనగా వెలుతురు, ’గ్రాఫిక్’ అనగా గీయటం అని గ్రీకుపదాల నుంచి వచ్చింది. ఫొటోగ్రఫీ ప్రారంభం అనేది క్రీ.పూ.5వ శతాబ్ధంలో జరిగింది. క్రీ.శ.11వ శతాబ్దం నాటికి ఇవాకి శాస్త్రవేత్త కెమెరా ఆబ్‌స్క్యూరా ఆవిష్కరించారు. ఈ కెమెరా ద్వారా ఇమేజెస్ రికార్డు చేయటం సాధ్యంకాలేదు. కేవలం వేరొక ఉపరితలంపై ప్రతిబింబం చేశారు. తదుపరి 17వ శతాబ్ధం నాటికి కెమెరా ఆబ్స్క్యూరాను బేసిక్ లెన్స్‌తో చిన్నసైజులో తయారు చేశారు. గ్రహణకాలంలో సూర్యుడి రావటం, పోవటం, ఆ మధ్యలో వచ్చే పరిణామాలను చూడటానికి ఆబ్‌స్క్యూరా కెమెరా బాగా ఉపకరించింది. గ్రహణకాలంలో సూర్యగ్రహణ సమయాన కండ్లకి హాని కలుగకుండా గ్రహం గురించి పరిశోధించటం ఈ పద్ధతి ద్వారా సులువైంది.
కలకత్తాలో ప్రారంభమైన ఫొటోగ్రఫీ
1830లో ఫ్రాన్స్‌కు చెందిన జోసెఫ్ నీస్ఫోర్ నీఫ్స్ ఫోర్టబుల్ కెమెరా ఆబ్‌స్క్యూరా బిటుమెన్ రసాయనికపూతతో కూడిన ఫీటర్ప్లేటుపై ఎక్స్పోజు చేశారు. ఈ ఇమేజ్ను మొదటిసారిగా రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. ఇది వెంటనే ఫేడ్ కాలేదు. కానీ ఎక్కువకాలం ఈ ఇమేజ్ ఉండటం సాధ్యంకాలేదు. దీంతో తర్వాత జోసిఫ్నీప్స్, బాయిస్ డాగ్యురే ఇరువురు కలిసి సంయుక్తంగా పరిశోధనలు చేసిన ఫలితంగా డాగ్యురేటైప్ ఫొటోగ్రఫీని తయారు చేశారు. పరిశోధనల పూర్తిఫలితం రాకముందే జోసిఫ్నీప్స్ మరణించటంతో డాగ్యురే పరిశోధనలు పూర్తిచేసి, ఫొటోగ్రఫీలో శాస్వల్ ఇమేజ్ను రూపొందించారు. ఈ విధానంలో 1850లో ఎమల్షన్ ప్లేట్స్ ఎక్స్‌ఫోజర్ టైమ్ మాత్రం సరిపోయేది. 1841లో విలయం హెన్సీపోక్స్ కాలెటైప్ ప్రక్రియ లెటెంట్ పద్ధతుల ద్వారా ఆధునిక ఫొటోగ్రఫీకి మూలమైన పాజిటివ్ నెగెటివ్‌లను కనుగొన్నారు. అలా దేశంలో తొలిసారిగా కలకత్తా నగరంలో ఫొటోగ్రఫీ మొదలైంది.
డిజిటల్ కెమెరాలతో ఆదరణ కరువు
ఫొటోగ్రఫీని వ్యాపారాత్మకంగా కాకుండా కళాదృష్టితో చూస్తే దానిలోని భావం తెలుస్తుందని ఫొటోగ్రాఫర్లు భావిస్తున్నారు. ఒకప్పుడు కెమెరాలో ఫిల్మ్ ద్వారా తీసే ఫొటోలు ఇప్పుడు డిజిటల్ కెమెరాల రాకతో ఫొటోగ్రఫీపై చులకనభావం ఏర్పడిందని పలువురు ఫొటోగ్రాఫర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే కెమెరాలు 25వేల నుంచి రెండులక్షల రూపాయల వరకు ఉండగా, అనేక మంది తక్కువ ధర ఉన్న చిన్న కెమెరాలు కొనుగోలు చేసి వాడటం వల్ల ఫొటోగ్రఫీనే జీవనాధారంగా ఉన్న వారు నష్టపోతున్నారు. జీవనోపాధి కోసం ఫొటోగ్రఫీని ఎంచుకోవటం వల్ల సమాజంలో ఆదరణ తగ్గింది. మామూలు చిన్నకెమెరాతో ఇళ్లలో తీసుకునే ఫొటోలకు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు తీసే ఫొటోలకు పెద్ద తేడాలేకపోవటం వల్ల ఫొటోగ్రఫీ అంటే చులకన భావం ఏర్పడుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం చేయూతనివ్వాలి
చదువుకున్న యువతకు ఫొటోగ్రఫీ ఆదాయాన్ని ఇస్తుంది. నైపుణ్యాన్ని బట్టి నెలకు పదివేల వరకు సంపాదిస్తున్నారు. ఆర్థిక స్థోమత లేనివారు ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్లుగా పనిచేస్తూ, దూరవిద్యలో చదువులు కొనసాగిస్తున్నారు. నేను ఫొటోస్టూడియోను ఏర్పాటు చేసి నేటికి ఇరవైఐదేళ్లు అవుతుంది. రోజురోజుకూ మారుతున్న ఫొటోగ్రఫీకనుగుణంగా తాము కూడా మారాల్సి వస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం చేయూతనివ్వాల్సిన అవసరమున్నది.