వికారాబాద్, సెప్టెంబర్ 22 : ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లుగా పనిచేస్తున్న కార్మికులకు గత సంవత్సరంలో పెండింగ్లో ఉన్న ఏడు నెలల వేతనాలు, ఈ సంవత్సరం నాలుగు నెలల వేతనాలు వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బుస్స చంద్రయ్య డిమాండ్ చేశారు. సోమవారం దౌల్తాబాద్ మండలానికి చెందిన స్కావెంజర్లు సిఐటియు ఆధ్వర్యంలో వికారాబాద్ కలెక్టరేట్ ముంధు ధర్నా చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్కు, డీఈఓలకు వేరు వేరుగా వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండుగకు వెంటనే డబ్బులు విడుదల చేయాలని, లేక పోతే వారి కుటుంబాలు పస్తులుండా వలసి వస్తుందన్నారు. పండుగ రోజు అందరూ సంతోషంగా ఉంటే స్కావెంజర్స్ పస్తులు ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్కావెంజర్ల పెండింగ్లో ఉన్న డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికునికి నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగస్తులు గుర్తించాలని తెలిపారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రతి స్కావెంజర్కు సంవత్సరానికి రెండు డ్రస్సుల దుస్తులు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కావెంజర్ల సంఘం దౌల్తాబాద్ మండల్ అధ్యక్షులు వెంకటప్ప, సత్యమ్మ, భారతమ్మ, దౌల్తాబాద్ మండలంలోని స్కావెంజర్లు , ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే కార్మికులు పాల్గొన్నారు.