హైదరాబాద్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఉచితంగానే ఎల్ఆర్ఎస్ పథకం అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హమీని నెరవేర్చాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి( BRS MLA Sabitha) డిమాండ్ చేశారు. మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ (LRS scheme) బాధితులకు అండగా ఉంటామని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ పథకం గడువు మార్చి నెలాఖరు వరకు డెడ్‌లైన్ (Deadline) పెట్టడం పై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని వాగ్ధానాలు చేసిన నాయకులు ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారని ద్వజమెత్తారు. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను మూట గట్టుకుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, బడంగ్‌పేట డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఎల్బీనగర్లో..
ఎల్బీనగర్లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(MLA Sudeer reddy) ఆధ్వర్యంలో ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ను ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచిన కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరిచే చర్యలు తీసుకుంటుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్ గుప్తా , మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, ప్రవీణ్, సాగర్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, పద్మానాయక్ తదితరులు పాల్గొన్నారు.