పరిగి, డిసెంబర్ 22 : ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి సర్పంచ్‌లకు సూచించారు. సోమవారం వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్, సయ్యద్‌పల్లి, మిట్టకోడూర్, లక్ష్మీదేవిపల్లి గ్రామాలలో సర్పంచ్ల ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్పంచ్ అత్యంత కీలకమైన పాత్ర అని తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఆ తర్వాత అందరితో కలుపుగోలుగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
సర్పంచ్‌లు తప్పనిసరిగా తమ గ్రామాలలో నిత్యం పర్యటిస్తూ మంచినీటి సరఫరా వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూడాలని, పారిశుద్ధ్య వ్యవస్థ ఎప్పటికపుడు పర్యవేక్షించి గ్రామాలను పరిశుభ్రతకు నిలయాలుగా మార్చాలన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారవేయకుండా, ఇంటింటి నుంచి చెత్త సేకరణ కొనసాగించాలని పేర్కొన్నారు. ప్రతి సర్పంచ్ ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధిపై సమీక్షించుకొని ముందుకు సాగుతూ ప్రజాదరణను మరింత పెంపొందించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా మండలంలోని క్లస్టర్ల వారిగా ఎంపీడీవొ హరిప్రియ, మండల పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ వరలక్ష్మీ, ఎంపీవొ కరీం, ఇతర అధికారులు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో సర్పంచ్‌లు, వార్డుసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.