పరిగి, ఏప్రిల్ 15 : వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ పండుగను విజయవంతం చేద్దామని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి కోరారు. సభకు ప్రతి ఊరు నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. ఈనెల 27వ తేదీన వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సందర్భంగా మంగళవారం పరిగిలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ ఒకటిరెండు రోజులలో మండల స్థాయిలో నాయకులు కూర్చొని ఏ ఊరుకు బస్సు పెట్టాలి, సొంత వాహనాలు ఎన్ని ఉన్నాయి తదితర వివరాలు అందజేయాలన్నారు.
27వ తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో పార్టీ జెండా ఎగురవేయాలని సూచించారు. ప్రతి గ్రామం నుంచి ఉదయం 7 గంటలకే మహాసభకు బయలుదేరాలన్నారు. సభకు వచ్చే వారికి భోజన సదుపాయం కల్పించడం కల్పిస్తామన్నారు. మహాసభ తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ దిశా నిర్దేశం మేరకు పార్టీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని ఆయన విమర్శించారు. ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతుందన్నారు. మన రోజులు తప్పనిసరిగా వస్తాయని, అనునిత్యం ప్రజలకు అండగా నిలుస్తూ పోరాటం చేద్దామన్నారు.