Indiramma Illu | వికారాబాద్, మే 21 : రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారుల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ సభ్యులకు అప్పగించడం పట్ల పలు విమర్శలు తలెత్తుతున్నాయి. కమిటీలకు అప్పగించడం వల్ల అసలైన అర్హులకు అన్యాయం జరుగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాపై ఆయా గ్రామాల, పట్టణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో ఒక్కో గ్రామం నుంచి దాదాపు 400 నుంచి 600 వరకు ఇందిరమ్మ ఇంటి కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపిక రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, జిల్లా అధికారుల పర్యవేక్షణలో జరుగుతుందని అనుకున్నారు. కానీ ఆ బాధ్యతను ఇందిరమ్మ కమిటీలకు అప్పగించారు. కానీ లబ్ధిదారులను ఎంపిక చేసిన అర్హుల జాబితా తప్పుల తడకగా ఉంది. గ్రామ కమిటీలు తయారు చేసిన జాబితాను వెరిఫికేషన్ చేసేందుకు గెజిటెడ్ అధికారులను నియమించినప్పుడు అసలు బాగోతం బయటపడింది. ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసిన జాబితాలో అనర్హుల పేర్లే ఎక్కువగా ఉన్నాయి. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు విఫలమయ్యారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అర్హులైన వారిని ఎంపిక చేసి, నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
కూలిపోయిన ఇంటిలోనే ఉంటున్నాం : భీమమ్మ, మైలార్దేవరంపల్లి, వికారాబాద్
గతంలో కురిసిన వర్షాలకు ఇల్లు ఓ పక్క కూలిపోయింది. ఇంట్లో నలుగురం ఉంటాం. రెండు ఎకరాల భూమి ఉంది. కూలీ పనులు, వ్యవసాయ పనులు చేసుకుంటూ బతుకుతున్నాం. ఉన్న ఇల్లు కూడా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందోనని భయంభయంగా బతుకుతున్నాం. కూలిపోయిన ఇంటికి ప్రభుత్వం నష్టపరిహరం అందజేయలేదు. ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు చేసుకున్నాం. ఇందిరమ్మ ఇంటికి నేను అన్ని విధాల అర్హురాలినే. కానీ ఇటీవల విడుదలైన ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నా పేరు లేదు. కూలిన ఇంట్లోనే జీవనం సాగించాల్సి వస్తుంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి మా లాంటి అర్హులైన, ఇల్లు కూలిన వారికి మొదటి ప్రాధాన్య ఇవ్వాలి.