Kodangal | కొడంగల్, జూన్ 17: బాలికల విద్య దేశానికి ఎంతో వెలుగును అందిస్తుందని కొడంగల్ మండల విద్యాధికారి రాంరెడ్డి తెలిపారు. మంగళవారం బడిబాట కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బాలిక విద్యపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఎంఈవో రాంరెడ్డి మాట్లాడుతూ.. బాలికలు చదువుకోవడం వల్ల ఇంటితో పాటు దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు సాగే ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, నాణ్యమైన విద్యతోపాటు సామాజిక విలువలతో కూడిన విద్యాబోధన కొనసాగుతుందని ఎంఈవో తెలిపారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ చిన్నారులను చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలల్లోని పైపై మెరుగులను చూసి మోసపోవద్దని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో అన్నింట శిక్షణ పొందిన ఉపాధ్యాయులు నియమించడం వల్ల ఉత్తమ విద్య బోధన కొనసాగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, స్కూల్ యూనిఫామ్ వంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులో ఉండి విశాలమైన తరగతి గదులతో పాటు క్రీడా మైదానం ఉంటుందని సూచించారు. హంగులు ఆర్భాటాల ప్రకటనలు చూసి మోసపోవద్దన్నారు. సామాజిక విలువలతో కూడిన విద్యను అభ్యసించే విధంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. ఇందులో భాగంగా 6 నుంచి 8వ తరగతి వరకు జిల్లా పరిశోధన పాఠశాలలో మొత్తం 22 మంది విద్యార్థినులు చేరడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని విస్తృత ప్రచారంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో అందుకునే సౌకర్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించి పాఠశాలలో చేర్చి విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు.