వికారాబాద్, ఆగస్టు 2 : గత కొంతకాలంగా కేసీఆర్, కేటీఆర్ కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకొని జుగుప్సాకరమైన శీర్షికలు పెడుతూ, వార్తలు ప్రసారం చేయడంతో సరికాదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ మండలం జైదుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా టీవీ ఉద్దేశపూర్వకంగా ప్రసారం చేస్తున్న నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు తప్పు అని శాంతియుతంగా నిరసన తెలుపడానికి వెళ్లిన బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్యను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు.
జంగయ్యను అరెస్టు చేసి 22 రోజుల పాటు చంచల్ గూడ జైలులో ఉంచడం, అతడి అరెస్టుకు సంబంధించిన సమాచారం కుటుంబ సభ్యులకు గానీ, సన్నిహితులకు గానీ తెలుపకుండా గోప్యంగా ఉంచడం, టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిపై దాడి చేయడం అమానుషచర్య అని అన్నారు.
ఇలాంటి చర్యలు చేపడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు.
ఇటువంటి పక్షపాత ధోరణితో వ్యవహరించే జర్నలిజాన్ని, వారిని ప్రోత్సహించే ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. జర్నలిజాన్ని బ్రష్టు పట్టిస్తూ, కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు రాతలు రాస్తూ జర్నలిస్టుల విలువలను దిగజార్చే వారికి రాబోయే రోజుల్లో తగిన మూల్యం వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. వారితో పాటు మండల అధ్యక్షులు మహిపాల్‌రెడ్డి, జైదుపల్లి మాజీ ఉప సర్పంచ్ సురేష్‌కుమార్ తదితరులు ఉన్నారు.