దోమ,మే 28 : మొలకెత్తిన ధాన్యంతో రైతులు రోడ్డెక్కిన ఘటన బుధవారం దోమ మండల పరిదిలోని అయినాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ధాన్యాన్ని అమ్ముకుందామని గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రంకు తీసువస్తే అధికారులు మాత్రం రెండు రోజులకు ఒక లారీని పంపడంతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దానికి తోడుగా వర్షాలు కురవడంతో కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యం తడిసి మొలకలు వచ్చి నాశనం అవుతున్నా సంబందిత అధికారులు మాత్రం అలసత్వం ప్రదర్శిస్తూ సకాలంలో లారీలు పంపకపోవడంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిల్లర్లు, అధికారుల మధ్య సమన్వయం లేకనే రైతులకు ఇలాంటి పరిస్థితి దాపురించిందని రైతులు అంటున్నారు. తడిసిన వడ్లను సైతం కొంటామని ప్రగల్బాలు పలుకుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ దుస్థితి కనిపించడం లేదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం అయిపోయే వరకు రోజుకో లారీని పంపించి కొనుగోళ్లు సజావుగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.