Deer Dies | పూడూరు, ఏప్రిల్ 30 : కుక్కల దాడిలో ఓ జింక తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పూడూరు మండలం దామగుండం దేవాలయం సమీపంలోని అడవిలో వందల సంఖ్యలో జింకలు ఉన్నాయి. వేసవి కాలం కావడంతో జింకలు అడవిలోని దామగుండం దేవాలయంలోని కోనేరు వద్ద తాగునీటి కోసం సహజంగా వస్తువుంటాయి. తరచుగా అడవిలోని జింకలను కుక్కలు వేటాడి చంపడం జరుగుతుంది.
బుధవారం ఉదయం గ్రామస్తులు దేవాలయం ప్రాంతానికి వెళ్తుండగా కుక్కల దాడిలో మృతి చెందిన జింక కనిపించింది. గతంలో కుక్కల దాడిలో అనేక జింకలు, ఇతర వన్యప్రాణులు మృతి చెందడం, ఫారెస్ట్ అధికారులు రావడం చూడడం సర్వసాధారణం అయిందని అధికారుల పనితీరుపై స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైన ఫారెస్ట్ అధికారులు దామగుండం అడవిలోని జింకలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు.
విద్యుత్ షాక్తో 9 మేకలు మృతి
విద్యుత్ షాక్తో 9 మేకలు మృతి చెందిన ఘటన పూడూరు మండలం చీలాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం కురిసిన వర్షంతో పాటు తీవ్ర ఈదురు గాలులు వీయడంతో మెయిన్ లైన్ కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో ఇంటి సమీపంలోని కొట్టంలో ఉన్న మేకలకు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. మేకల మృతితో సుమారుగా రూ.1 లక్ష వరకు నష్టం వాటిలినట్లు రైతు రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి మృతిచెందిన మేకలకు ఆర్థిక సహాయం అందజేయాలని రైతు కోరారు.