వికారాబాద్, జూన్ 9 : పాఠశాలలు ప్రారంభం అయ్యే లోపు యూనిఫాంలను అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి బడిబాట, పాఠశాలలో యూనిఫాంలు, పాఠ్య పుస్తకాల అందుబాటు, ఇందిరా మహిళా శక్తి భవనాలు, సౌర విద్యుత్తు ప్లాంట్ల గ్రౌండింగ్, పెట్రోల్ పంపులు ఏర్పాటు, అర్హత ఉన్న మహిళలందరిని స్వయం సహాయక సంఘాల్లోకి చేర్చుకోవడంతో పాటు కొత్తగా ఎంపికైన గ్రూప్ నాయకులకు జిల్లా స్థాయిలో శిక్షణ, అంగవైకల్యం కలిగిన వారి నిర్ధారణ నిమిత్తం సదరం/యుడిఐ కింద మూల్యాంకనం తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా చేపట్టాల్సిన విధివిధానాలపై పలు సూచనలు , సలహాలు ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లాలో పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫాంలు, మహిళా శక్తి భవన నిర్మాణం, పెట్రోల్ బంకుల ఏర్పాటుపై కలెక్టర్ వివరిస్తూ..జిల్లాలోని పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు అందించేందుకు 65 వేల యూనిఫాంలు అవసరం ఉందని, ఇప్పటికే 61 వేల యూనిఫాంలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మిగతావి పాఠశాల పునఃప్రారంభం లోపు పూర్తి చేసి అందజేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని కలెక్టరేట్ ఆవరణలో నిర్మించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మహిళా సాధికారత కోసం మహిళలను ప్రోత్సహించే దిశగా పెట్రోల్ బంకుల ఏర్పాటుకు స్థలాల కేటాయింపుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుండి అదనపు కలెక్టర్ సుధీర్, డీఆర్డిఓ శ్రీనివాస్, డిపిఓ జయసుధ, డీఈఓ రేణుకా దేవి తదితరులు పాల్గొన్నారు.