
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్‌లో అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టును రాష్ర్టానికే ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దాలని మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సబితారెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టు అభివృద్ధిపై శనివారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయాలని టూరిజం ఎండీ మనోహర్‌రావును ఆదేశించారు.
అనంతపద్మనాభస్వామిని దర్శించుకొని బటయకు వస్తుంటే ఆలయంపై రెండు గోపురాలు ఉంటాయి. ఒక గోపురం పూర్తిగా బంగారు రంగులో, మరొకటి తెలుపు రంగులో ఉంటుంది. భక్తులు ఫోటోలు, సెల్ఫీలు దిగుతుంటారు.
తెలంగాణ ఊటీగా పేరొందిన అనంతగిరి కొండలు పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్నాయి. ఇక్కడున్న పచ్చదనం.. స్వచ్ఛమైన గాలినిచ్చే పెద్ద పెద్ద చెట్లు మనసుకు ప్రశాంతతను చేకూరుస్తాయి. వానకాలంలో ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాల సవ్వడి.. వినసొంపైన పక్షుల కిలకిల రావాలు మైమరిపిస్తాయి. వికారాబాద్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ ప్రాంతానికి చెంతనే ఉన్న అత్యంత ప్రసిద్ధిగాంచిన అనంతపద్మనాభ స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను ఆవిష్కరిస్తున్నది. మూసీ నది జన్మస్థలం, భగీరథ గుండం, ప్రాచీన కట్టడాలు, గుహలు, పురాతన కోటలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. భక్తులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని అనంతరం ప్రకృతి అందాలను వీక్షిస్తూ రోజంతా సరదాగా గడుపుతారు. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు జిల్లాతోపాటు పక్క జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తుంటారు. ఇక వారంతంలో, సెలవుదినాల్లో ఇక్కడి పరిసరాలు పర్యాటకులతో కిక్కిరిసిపోతాయి. ఇక్కడున్న వాచ్ టవర్‌పై నుంచి వీక్షిస్తే నంది ఘాట్, ఘాట్ రోడ్లు, సమీపంలోని చెరువులు, కుంటలు, లోయలు, అడవి మధ్యల నుంచి పరుగెత్తే రైలు వంటి దృశ్యాలు కనువిందు చేస్తాయి.
ప్రకృతి రమణీయమైన అందాల నడుమ ఉన్న అనంతగిరి కొండలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి… చుట్టూ కళకళలాడుతున్న పచ్చని బైళ్లు, కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాలు.. ప్రాచీన ఆవాస ప్రదేశం, గుహలు, కోటలు, ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న అనంతపద్మనాభస్వామి ఆలయం… అడవి మధ్యలోని ఘాట్ రోడ్లు… ప్రకృతి అందాన్ని ఆరబోస్తున్నట్లుగా చూడచక్కని అటవీ ప్రాంతమిది… వికారాబాద్ జిల్లా కేంద్రానికి 5 కి.మీ దూరంలో ఉన్న అనంతగిరి కొండల పరిసర ప్రాంతాల్లోని అటవీ ప్రాంత దృశ్యాలివి… ఈ కొండలను చూసేందుకు సమీపంలో ఉన్న హైదరాబాద్ వాసులతో పాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి సెలవు రోజుల్లో జనం భారీగా తరలి వస్తున్న సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
– వికారాబాద్, ఆగస్టు 7 ( నమస్తే తెలంగాణ)/వికారాబాద్
ఆలయం నుంచి భగీరథ గుండం వద్దకు వెళ్తేంటే కుడివైపు కొండ గుహల్లో మార్కండేయుడు తపస్సు చేస్తున్నట్లు కనిపిస్తుంటాడు. పూర్వం మార్కండేయుడు తపస్సు చేసేందుకు అనువైన స్థలం కోసం వెతుకుతుంటే అనంతగిరి ఆలయం వద్ద ఈ గుహలు కనిపించాయని చెబుతుంటారు.
అనంతగిరి అడవిలో దాదాపు వెయ్యి ఏండ్ల కింద మూసి నది పుట్టింది. ఇక్కడి నుంచి పారుతూ హైదరాబాద్ మహానగరంతో పాటు నల్లగొండ జిల్లా కృష్ణా నదిలో కలుస్తుంది. ఇది స్వచ్ఛమైన నీటితో 10,168 అడుగుల ఎత్తులో పుట్టి తూర్పు దిశగా పయనిస్తుంది. అనంతగిరి అడవి మధ్యలోంచి ఈ నది పారుతుంది.
వికారాబాద్ పట్టణం నుంచి అనంతగిరి వస్తున్న మార్గమధ్యలో బంగారపు రంగులో నిలిచి ఉన్న జింక విగ్రహం కనిపిస్తుంది. ఈ జింక వెనక్కి మళ్లినట్లుగా కనిపిస్తుంది. జింక విగ్రహం ప్రధాన రోడ్డుకు మధ్యలో ఉండటంతో మూడుదారులను చూపుతుంది.
అనంతపద్మనాభస్వామిని దర్శించుకుని తూర్పు దిక్కున తాండూరు రోడ్డుపై వస్తుంటే గుట్ట దిగుతున్న సమయంలో నంది విగ్రహం కనిపిస్తుంది. నంది విగ్రహాన్ని దర్శించుకోవడంతో పాటు సెల్ఫీలు, ఫొటోలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రధాన రోడ్డుకు పక్కనే ఉండడంతో ఆ ప్రాంతాన్ని నందిఘాట్ అని పిస్తుంటారు. శని, ఆదివారాల్లో అటవీ శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తుంటారు.
మూసి నది జన్మస్థలం పక్కనే 100 ఏండ్ల మామిడి చెట్టు, మూసి నది జన్మస్థలం పక్క దారి గుండా వెళ్తే కొద్ది దూరంలో 100 ఏండ్ల నాటి మర్రి చెట్టు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. 100 ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ట్రీ బోర్డును ఏర్పాటు చేశారు. పర్యాటకులకు నీడను సైతం ఇస్తుంది.
వర్షాలు కురిసినప్పుడు అనంతగిరి నంది ఘాట్ నుంచి అడవిలోకి వెళ్లే దారిలో కొండపై నుంచి నీరు కిందకు పారుతుంటుంది. అక్కడక్కడ వాటర్ ఫాల్స్ సైతం కనిపిస్తాయి. జలపాతం వద్ద పర్యాటకులు ఆనందంగా గడుపుతారు.